నాలుగు యూనివర్సిటీలకు ఇన్‌‌చార్జి వీసీలే

నాలుగు యూనివర్సిటీలకు ఇన్‌‌చార్జి వీసీలే
  • రెగ్యులర్‌‌‌‌ వీసీలు లేకపోవడంతో యూనివర్సిటీల్లో పెండింగ్‌‌లో పలు సమస్యలు 
  • జేఎన్టీయూ, ఫైన్‌‌ ఆర్ట్స్‌‌ వర్సిటీలకు సెర్చ్ కమిటీ వేసినా వీసీల నియామకం జరగలె 
  • మహిళా వర్సిటీ, ఆర్జీయూకేటీల్లో ఇన్‌‌చార్జిలే కొనసాగింపు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు యూనివర్సిటీల్లో ఇంకా ఇన్‌‌చార్జి వీసీల పాలనే నడుస్తున్నది. మొత్తం వర్సిటీల్లో మూడో వంతు వర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు. దీంతో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అయితే, రెండు వర్సిటీలకు సెర్చ్ కమిటీలను నియమించినా.. వాటికీ రెగ్యులర్ వీసీలను నియమించలేదు.

రాష్ట్రంలో విద్యా శాఖ పరిధిలో మొత్తం 12 సర్కారు యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో జేఎన్టీయూ, జవహర్‌‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, బాసర ఆర్జీయూకేటీ తదితర వాటిలో ప్రస్తుతం ఇన్‌‌చార్జి వీసీలే కొనసాగుతున్నారు. మిగిలిన 7 వర్సిటీలకు నెలన్నర క్రితం ప్రభుత్వం రెగ్యులర్ వీసీలను నియమించగా, నాలుగు రోజుల క్రితం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి వీసీని నియమించింది.

వీటితో పాటే జేఎన్టీయూ, జేఎన్ఏఎఫ్‌‌యూలకూ సెర్చ్ కమిటీలు వేశారు. ఇందులో జేఎన్టీయూ సెర్చ్ కమిటీ భేటీ అయింది. కానీ, కొత్త వీసీ పేరును మాత్రం ప్రకటించలేదు. మరోపక్క ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ సెర్చ్ కమిటీ సమావేశం ఇంతవరకూ జరగలేదు. ఈ రెండు వర్సిటీలకు ఇటీవల రెండోసారి కొత్తగా ఇన్‌‌చార్జిలను నియమించింది. మహిళా వర్సిటీ, బాసర ట్రిపుల్ఐటీలకు కూడా రెగ్యులర్ వీసీలను నియమించలేదు. 

వీసీల నియామకంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి..

రెండు నెలల క్రితం జేఎన్టీయూహెచ్ సెర్చ్ కమిటీ సమావేశమై ముగ్గురు పేర్లను ప్రతిపాదించింది. అయితే, దీనిపై సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మేలో ఆ వర్సిటీ వీసీ కట్టా నర్సింహారెడ్డి పదవీకాలం ముగియడంతో నాటి విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను ఇన్‌‌చార్జిగా సర్కారు నియమించారు. ఇటీవల ఆయనను టీజీపీఎస్సీ చైర్మన్‌‌గా నియమించడంతో, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డికి ఆ వర్సిటీకి ఇన్‌‌చార్జి వీసీగా బాధ్యతలు అప్పగించారు.

మేలో వేసిన సెర్చ్ కమిటీ అక్టోబర్‌‌‌‌లో భేటీ అయినా, ఇప్పటికీ కొత్త వీసీని ఎందుకు నియమించలేదనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విద్యా శాఖలో కీలకంగా వ్యవహరించిన ఓ ఉన్నతాధికారి కావాలనే కొత్త వీసీ నియామకాన్ని అడ్డుకున్నారనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలోని పెద్ద యూనివర్సిటీగా ఉన్న జేఎన్టీయూకు రెగ్యులర్ వీసీ లేకపోవడంతో వర్సిటీలో కీలక నిర్ణయాలు పెండింగ్‌‌లో పడిపోతున్నాయని ప్రొఫెసర్లు చెప్తున్నారు.

మరోపక్క ఆర్జీయూకేటీ- బాసరకు పదేండ్ల నుంచి ఇన్‌‌చార్జి వీసీలే కొనసాగుతున్నారు. గత బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌ ఆ వర్సిటీకి వీసీని నియమించే ఆలోచన చేయలేదని, కనీసం ప్రస్తుత ప్రభుత్వమైనా రెగ్యులర్ వీసీని నియమించాలని విద్యావేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వర్సిటీల్లో వీసీల నియామకంపై దృష్టి పెట్టాలని స్టూడెంట్లు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు కోరుతున్నారు.