మంత్రాల నెపంతో నా కుమారుడిని గురుకులం నుంచి వెళ్లగొట్టిన్రు

మంత్రాల నెపంతో నా కుమారుడిని గురుకులం నుంచి వెళ్లగొట్టిన్రు
  • ఆరో తరగతి స్టూడెంట్‌ తండ్రి ఆరోపణ
  • కౌన్సెలింగ్‌ మాత్రమే ఇచ్చానన్న ప్రిన్సిపాల్‌
  • జనగామ జిల్లా పెంబర్తి గురుకులంలో ఘటన 

జనగామ, వెలుగు : మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ తన కుమారుడిని గురుకులం నుంచి వెళ్లగొట్టారని ఓ స్టూడెంట్‌ తండ్రి ఆరోపించారు. ములుగు జిల్లా అబ్బాపురానికి చెందిన భద్రయ్య శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తన కుమారుడు అక్షిత్‌ పెంబర్తి ఎంజేపీలో ఆరో తరగతి చదువుతున్నాడని, కొన్ని రోజుల కింద ప్రిన్సిపాల్ ‌‌‌‌‌‌ చంద్రమౌళి ఫోన్‌ చేసి అక్షిత్‌ ప్రవర్తన సరిగా లేదని చెప్పడంతో తాను గురుకులానికి వచ్చానన్నారు. ఈ టైంలో ‘అక్షిత్‌కు మంత్రాలు వస్తాయా ? అతడి ప్రవర్తన బాగా లేదు, మిగతా స్టూడెంట్లను భయపెడుతున్నాడు.. టీసీ ఇచ్చేస్తా ఇంటికి తీసుకెళ్లండి’ అని ప్రిన్సిపాల్‌ చెప్పాడని భద్రయ్య ఆరోపించాడు.

దీంతో అదే రోజు తన కొడుకు అక్షిత్‌ను తీసుకొని గ్రామానికి వెళ్లిపోయానన్నారు. దసరా సెలవులు ముగియడంతో తన కుమారుడి టీసీ తీసుకునేందుకు శుక్రవారం గురుకులానికి వచ్చానని, ప్రిన్సిపాల్‌ ‌‌‌‌‌‌చంద్రమౌళి మాత్రం టీసీ ఇవ్వకుండా, గతంలో జరిగిందంతా మర్చిపోయి అక్షిత్‌ను ఇక్కడే చదివించాలని కోరారన్నారు. గత నెలలో జరిగిన పేరెంట్స్ ‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌లో భోజనాలతో పాటు స్టడీ బాగా లేదని చెప్పడంతో, అది మనసులో పెట్టుకొని తన కొడుకును ఇబ్బందిని పెడుతున్నారని ఆరోపించారు. ఇంత జరిగిన తర్వాత తన కొడుకుతో ఎవరూ స్నేహం చేయరని, తాను గురుకులంలో చదివించనని స్పష్టం చేశాడు. అక్షిత్ ‌‌‌‌‌‌‌‌పై అసత్య ప్రచారం చేసి, మానసికంగా ఇబ్బంది పెట్టిన ప్రిన్సిపాల్ ‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

కౌన్సెలింగ్ ‌‌‌‌‌‌‌‌మాత్రమే ఇచ్చా

అక్షిత్‌‌‌‌‌‌‌‌ తన ప్రవర్తనతో తోటి స్టూడెంట్లను ఇబ్బంది పెడుతుండడంతో అతడి తండ్రిని పిలిపంచానని గురుకులం ప్రిన్సిపాల్ ‌‌‌‌‌‌‌‌ చంద్రమౌళి చెప్పారు. తండ్రీకొడుకులకు కౌన్సిలింగ్ ‌‌‌‌‌‌‌‌ మాత్రమే ఇచ్చాను కానీ గురుకులం నుంచి వెళ్లగొట్టలేదన్నారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే సరిచేసుకోవాలని, అతడి ప్రవర్తనతో మిగతా స్టూడెంట్లు ఇబ్బంది పడొద్దనే సూచన చేసినట్లు తెలిపారు. కానీ అక్షిత్ ‌‌‌‌‌‌‌‌ తండ్రి అనవసరంగా అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు.