రంగవారిగూడెంలో పేలిన గ్యాస్​ సిలిండర్

దమ్మపేట, వెలుగు: ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి రెండు గుడిసెలు కాలిపోయిన ఘటన దమ్మపేట మండలం రంగువారిగూడెంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన బాల శ్రీనివాసరావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. మంటలు చెలరేగి పక్కనే ఉన్న బాట్ల చెన్నారావు ఇంటికి కూడా అంటుకున్నాయి. దీంతో రెండు గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. సిలిండర్ పేలిన సమయంలో మహిళలు పొలం పనులకు వెళ్లగా, మగవారు గొర్రెలు కాసేందుకు వెళ్లారు. ఇళ్లలో ఎవరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నించినా.. అదుపులోకి రాలేదు. అశ్వారావుపేట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే రెండు ఇళ్లు కాలిపోయాయి. సుమారు రూ.1,65,000  నగదు, బైక్, రెండు క్వింటాళ్ల బియ్యం, బంగారు ఆభరణాలు కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో ఒక లేగ దూడ చనిపోయింది. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.