
- యువకుడిని చంపి పొలంలో డెడ్‌బాడీని పాతిపెట్టిన అమ్మాయి తండ్రి, బంధువులు
- రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఘటన
- ఐదుగురు నిందితుల అరెస్ట్
షాద్ నగర్, వెలుగు: కూతురి వరుసయ్యే బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిని.. అమ్మాయి తండ్రి బంధువులతో కలిసి హత్య చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నిర్దవెల్లిలో జరిగింది. శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన రంజిత్, కరణ్ (18) వరుసకు అన్నదమ్ములు. వీరు కుటుంబాలతో కలిసి రెండేండ్ల కిందట మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్‌కు వలస వచ్చారు. బాలానగర్ మండలంలోని ఉడిత్యాల గ్రామంలో ఉంటూ శివారులోని పౌల్ట్రీ ఫామ్‌లో పనిచేసేవారు. రంజిత్ పెద్ద కూతురు(17)తో కరణ్ చనువుగా ఉండేవాడు. ప్రేమ పేరుతో ఆమె వెంటపడేవాడు.
‘వరుసకు నాకు తమ్ముడివి అవుతావు.. నా కూతురితో అలా ప్రవర్తించడం తప్పు’ అంటూ రంజిత్ చాలాసార్లు కరణ్‌ను హెచ్చరించాడు. అయినా కరణ్ అదే విధంగా ప్రవర్తిస్తుండటంతో రంజిత్ కుటుంబంతో సహా ఉడిత్యాల నుంచి మెదక్ జిల్లా నస్కల్‌కు వలస వెళ్లాడు. కొన్నిరోజుల తర్వాత కరణ్నస్కల్ నుంచి రంజిత్ కూతురిని బలవంతంగా వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. వారం రోజుల తర్వాత రంజిత్ వారి ఆచూకీని గుర్తించాడు. కూతురిని తన వెంట ఇంటికి తీసుకొచ్చాడు. అయితే, ఆ బాలిక నుదుటిపై తాను బొట్టు పెట్టిన ఫొటోను కరణ్ తమ బంధువులకు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. దీంతో తన పరువు పోయిందని భావించిన రంజిత్ ఎలాగైనా కరణ్ ను చంపాలని స్కెచ్ వేశాడు. విషయాన్ని బంధువులకు చెప్పి వారి సాయం కోరాడు. రంజిత్ నస్కల్ నుంచి మళ్లీ కేశంపేట మండలంలోని నిర్దవెల్లి గ్రామానికి వచ్చి అక్కడి పౌల్ట్రీ ఫామ్‌లో పనికి చేరాడు. కరణ్ ప్రతి మంగళవారం నిర్దవెల్లిలో జరిగే సంతకు వచ్చి రంజిత్ కూతురు వెంటపడేవాడు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. గత నెల 15న నిర్దవెల్లిలోని సంతకు వచ్చిన కరణ్.. రంజిత్ కు ఫోన్ చేశాడు. కూతురిని ఇచ్చి పెండ్లి చేయాలని అడిగాడు.
దీంతో అతడిపై మరింత కక్ష పెంచుకున్న రంజిత్ .. తన ప్లాన్‌ను అమలుచేయాలనుకున్నాడు. ఈ నెల 15న రాత్రి 11.50 గంటలకు నిర్దవెల్లి గ్రామం నుంచి జూలపల్లి వెళ్లే రోడ్లో మైసమ్మగుడివద్దకు రమ్మని కరణ్‌కు రంజిత్ చెప్పాడు. కరణ్ అక్కడికి రాగానే రంజిత్, అతడి బంధువులు నలుగురు కలిసి ఒక్కసారిగా దాడి చేశారు. కరణ్‌ను కాళ్లతో తొక్కి పక్కనే ఉన్న వరి పొలంలోని బురదలో అతడి తలను ముంచారు. ఊపిరాడకుండా చేసి చంపేశారు. అదే పొలంలో డెడ్‌బాడీని పాతిపెట్టారు. ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ చేసి కుటుంబంతో సహా రంజిత్ అక్కడి నుంచి పారిపోయాడు. తన తమ్ముడు కనిపించడం లేదంటూ కరణ్ అన్న దీపక్ కుమార్ కేశంపేట పీఎస్‌లో కంప్లయింట్ చేశాడు. రంజిత్‌పై అనుమానం ఉందని పోలీసులకు చెప్పాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు సోమవారం రంజిత్, అతడి బంధువులను అదుపులోకి తీసుకున్నారు. కూతురి వరుసయ్యే తన బిడ్డను కరణ్ వేధిస్తున్నాడని, అందుకే అతడిని హత్య చేసినట్లు రంజిత్ విచారణలో ఒప్పుకున్నాడు. అతడితో పాటు హత్యకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు మైనర్లు కావడంతో వారిని జువైనల్ హోమ్‌కు తరలించినట్లు డీసీపీ నారాయణ రెడ్డి తెలిపారు.