- మహబూబాబాద్ జిల్లా మూడు గుడిసెల తండాలో ఘటన
గూడూరు, వెలుగు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మూడు గుడిసెల తండాలో అప్పుగా తీసుకున్న రూ. 500 తిరిగి ఇవ్వమన్నందుకు బుధవారం రాత్రి ఓ వ్యక్తి మహిళను హత్య చేశాడు. ఎస్సై రాణాప్రతాప్ కథనం ప్రకారం... కోబల్‌తండా శివారులోని మూడు గుడిసెల తండాకు చెందిన తేజావత్ ఈరమ్మ (58) అదే గ్రామానికి చెందిన తేజావత్ స్వామికి 10 రోజుల కింద రూ.500 ఇచ్చింది. ఆ డబ్బులను తిరిగివ్వాలని మూడు రోజులుగా అడుగుతోంది.
అయితే తాను ఆ డబ్బులు ఎప్పుడో ఇచ్చేశానని స్వామి చెబుతూ వస్తున్నాడు. కానీ, స్వామి తన డబ్బులు ఇవ్వడం లేదని అతడి కుటుంబ సభ్యులతో పాటు, గ్రామంలో అందరికీ చెబుతోంది. దీంతో తన పరువు తీస్తోందని, ఇదే విషయాన్ని అడిగేందుకు స్వామి బుధవారం రాత్రి ఈరమ్మ ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్రిస్తున్న ఈరమ్మను గొంతు నులిమి చంపేశాడు. మృతురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు స్వామిని అరెస్ట్ చేశారు.