ప్రాణం తీసిన మధ్య వర్తిత్వం

ప్రాణం తీసిన మధ్య వర్తిత్వం
  • అప్పు ఇచ్చిన వ్యక్తి ఒత్తిడి చేసి బైక్ లాక్కోవడంతో మనస్తాపం
  • పాయిజన్ తాగి చికిత్స పొందుతూ యువకుడు మృతి
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చిరుమల్లలో  ఘటన

కరకగూడెం, వెలుగు : మధ్యవర్తిత్వం ఓ యువకుడి ప్రాణం తీసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. కరకగూడెం మండలం చిరుమల్లకు చెందిన దోమల ప్రణయ్(22) స్థానికంగా108 వెహికల్​ఈఎమ్ టీ గా పని చేస్తున్నాడు. పినపాక మండలం ఏడూల్ల బయ్యారం గ్రామానికి చెందిన ఉమ్మ సుబ్బారెడ్డి( పినపాక పీహెచ్ సీ108 వెహికల్​డ్రైవర్) వద్ద కరకగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రావుల తేజకు 1. 20లక్షలు, సిరిశెట్టి రవితేజకు రూ. 20 వేలు, జెట్టి అభిరామ్ కు రూ. 15 వేలను ప్రణయ్ మధ్యవర్తిగా ఉండి అప్పు కింద ఇప్పించాడు. 

ముగ్గురూ తిరిగి చెల్లించకపోవడంతో ప్రణయ్ ని కట్టాలని సుబ్బారెడ్డి పలుమార్లు ఒత్తిడి చేశాడు. గత నవంబర్30న అతని బైక్ ను లాక్కోవడంతో అవమానంగా భావించి మనస్తాపం చెందాడు. అదే రోజు గడ్డి మందు (పాయిజన్ ) తాగాడు. అనంతరం అయ్యప్ప మాలతో ఉన్న అతడు ఈనెల 2న ఇరుముడి కట్టుకొని శబరిమలై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో విజయవాడ చేరే సరికి ఈనెల 6న అతని ఆరోగ్యం బాగా క్షీణించడంతో తోటి భక్తులకు తాను పాయిజన్​తాగినట్లు చెప్పాడు. వారు కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పి కొత్తగూడెంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 

అక్కడ నుంచి ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ట్రీట్​మెంట్​ పొందుతూ గురువారం రాత్రి ప్రణయ్ మృతి చెందాడు. శుక్రవారం డెడ్ బాడీతో కుటుంబ సభ్యులు, బంధువులు ఏడూల్ల బయ్యారం క్రాస్​రోడ్ వద్ద ధర్నాకు దిగారు. స్థానిక సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజ్​కుమార్​వెళ్లి బాధిత కుటుంబానికి నచ్చజెప్పారు. మృతికి కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విరమించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు సమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు  తెలిపారు.