పాల్వంచ రూరల్, వెలుగు: భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో నిద్రలోనే ఆమెను భర్త హతమార్చిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. పాల్వంచ రూరల్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ మండలం సంగం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ కాయిత రాముకు ఐదేండ్ల కింద మంచిర్యాల జిల్లా చింతలపల్లికి చెందిన రాధ(31)తో పెండ్లి అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య వివాహేత సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఇంట్లో గొడవలు అవుతున్నాయి.
సోమవారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులు నిద్రపోయారు. కొద్దిసేపటి తర్వాత రాము లేచి నిద్రపోతున్న భార్య ముఖంపై దిండును అదిమి పెట్టి చంపేశాడు. అనంతరం పరార్ అయ్యాడు. తెల్లారి తల్లి ఎంతకూ లేవకపోవడంతో పిల్లల ఏడుపు విని కుటుంబసభ్యులు చూశారు. రాధ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడీని పాల్వంచ ప్రభుత్వ ఆస్ప్రతికి తరలించారు. నిందితుడు రాము కోసం గాలింపు చేపట్టినట్టు రూరల్ ఎస్ఐ సురేశ్ తెలిపారు.