
- హనుమకొండలో ఒకరు..బెల్లంపల్లిలో మరొకరు
- నక్కలగుట్ట సువిద్య కాలేజీ ఎదుట ఆందోళన
- ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం
హనుమకొండ, వెలుగు : ఇంటర్ పరీక్ష రాసి వచ్చిన ఇద్దరు స్టూడెంట్స్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. హనుమకొండ నక్కలగుట్టలోని ఓ ప్రైవేట్‌కాలేజీలో చదువుతున్న జూనియర్ ఇంటర్ స్టూడెంట్ హాస్టల్ గదిలో సూసైడ్ చేసుకోగా, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన సీనియర్ ఇంటర్ విద్యార్థి ఇంట్లో ఉరేసుకున్నాడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామానికి చెందిన మురారిశెట్టి సంధ్య-, సమ్మయ్య దంపతుల పెద్ద కూతురు నాగజ్యోతి(16) నక్కలగుట్టలోని సువిద్య జూనియర్ కాలేజీ హాస్టల్లో ఉంటూ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. బుధవారం పరీక్షలు స్టార్ట్ కాగా.. రాసి వచ్చింది. సాయంత్రం కాలేజీలో స్టడీ అవర్ లో మరుసటి రోజు ఎగ్జామ్ కోసం చదివింది. రాత్రి 7 గంటలకు తన గదికి వెళ్లింది. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో స్టూడెంట్స్వెళ్లి చూడగా..సీలింగ్‌కు చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. సిబ్బంది, కాలేజ్ మేనేజ్మెంట్ అక్కడికి వచ్చి చున్నీని కట్‌చేసి నాగజ్యోతిని కిందికి దించారు. రామ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి ఎంజీఎంకు తీసుకెళ్లగా నాగజ్యోతి అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో కాలేజీ యాజమాన్యం అక్కడి నుంచి పరారైంది.
కాలేజ్ ఎదుట స్టూడెంట్ యూనియన్ల ఆందోళన
నాగజ్యోతి చనిపోవడంతో ఆమె పేరెంట్స్, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగజ్యోతి మరణంపై తమకు అనుమానాలున్నాయని, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో కాలేజీలోని ఫర్నిచర్, అద్దాలు, బోర్డు ధ్వంసం చేశారు. ఏసీపీ కిరణ్‌కుమార్, సుబేదారి, హనుమకొండ, కేయూ సీఐలు షుకూర్, శ్రీనివాస్ జీ, దయాకర్ అక్కడికి వచ్చి సర్ది చెప్పారు. అయినా వినకపోవడంతో కొంతమంది స్టూడెంట్లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. బాధిత తల్లిదండ్రులు సాయంత్రం వరకు అక్కడే బైఠాయించగా.. చివరకు ప్రజాప్రతినిధులు, పోలీసుల చొరవతో ఆందోళన విరమించారు.
సంస్కృతం పరీక్ష బాగా రాయలేదని..
బెల్లంపల్లి: పరీక్ష బాగా రాయలేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కాల్ టెక్స్ ఏరియాకు చెందిన ఓ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాపెల్లి శంకర్, శారద కొడుకు శివకృష్ణ(18) గురువారం ఇంటర్ సెకండ్ ఇయర్ సంస్కృతం పరీక్ష రాశాడు. తల్లిదండ్రులకు, ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి పరీక్ష బాగా రాయలేదని బాధపడ్డాడు. ఇంటికి వెళ్లాక పేరెంట్స్ లేకపోవడంతో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకున్నాడు. బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.