నీటిలో మునిగి స్టూడెంట్​ మృతి.. కరీంనగర్ జిల్లా​లో ఘటన

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‭లో దారుణం జరిగింది. వార్డెన్​ చెప్పడంతో నాచు తీసేందుకు బావిలోకి దిగిన ఎనిమిదో క్లాస్​ స్టూడెంట్ నీళ్లలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన తిమ్మాపూర్​ మండలం ఎల్​ఎండీ కాలనీలోని సెయింట్ ఆంథోని స్కూల్​లో జరిగింది. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం తేలుకుంటకు చెందిన శ్రీకర్ (14) సెయింట్ ఆంథోని స్కూల్​లో ఎనిమిదో క్లాస్​ చదువుతూ స్కూల్ హాస్టల్​లోనే ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం స్టూడెంట్స్​ చదువుకుంటున్న టైంలో వార్డెన్ బావిలో ఉన్న నాచును తీసేయాలని నలుగురు పిల్లలను లోపలికి దించాడు. 

నాచు తీయాలని..బావిలోకి దింపిన వార్డెన్

ముగ్గురు విద్యార్థులు సేఫ్​గా బయటికి వచ్చారు. శ్రీకర్ నీటిలో మునిగిపోయాడు. భయంతో విద్యార్థులు ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. కొద్దిసేపటి తర్వాత స్కూల్​ సిబ్బంది శ్రీకర్​ గురించి అడగ్గా.. బావిలో మునిగి చనిపోయిన విషయం చెప్పారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించి రెస్యూ టీంతో శ్రీకర్ డెడ్​బాడీని బయటికి తీశారు. ఘటనకు కారణమైన వార్డెన్‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకొని బోరున విలపించారు. తమ కుమారుడు మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. తప్పకుండా న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు.