గడ్డి మందు కొట్టి పంట నాశనం చేసిన దుండగులు

గడ్డి మందు కొట్టి పంట నాశనం చేసిన దుండగులు
  • కరీంనగర్ ‌‌జిల్లా కందుగులలో ఘటన

హుజురాబాద్ రూరల్, వెలుగు: ఓ  రైతు వరి పంటకు గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు కొట్టి నాశనం చేసిన  ఘటన కరీంనగర్ ‌‌‌‌ జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన ప్రకారం.. హుజూరాబాద్ ‌‌ మండలం కందుగులకు చెందిన ఎండీ కరీం తనకు ఉన్న11 కుంటల వ్యవసాయ భూమిలో వరి సాగు చేశాడు. పంట చేతికి వచ్చే సమయానికి  గుర్తు తెలియని వ్యక్తులు గడ్డి మందు కొట్టారు. మంగళవారం తన పొలం వద్దకు వెళ్లిన కరీం పంట ఎండిపోవడం చూశాడు. కావాలని ఎవరో తన పంటకు గడ్డి మందు కొట్టి నష్టపోయేలా చేశారని ఆరోపించాడు.

 సుమారు రూ. 30 వేల నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. 60 ఏండ్లుగా భూమిని తమ కుటుంబం కాస్తు చేసుకుంటుందని, కాగా.. బంధువైన ఫాతిమా అనే మహిళ నకిలీ డాక్యుమెంట్లతో భూమిని పట్టా చేసుకునేందుకు ప్రయత్నించగా పలుమార్లు పంచాయితీ పెట్టినట్టు.. ఆ భూమి తమకే సొంతం చేస్తూ  గ్రామ పెద్దలు తీర్పు చెప్పినట్టు పేర్కొన్నాడు.

దీంతో చేసేదేమీ లేక ఆమె భూమిని అమరేందర్ రెడ్డి అనే న్యాయవాదికి పట్టా చేసిందని వాపోయాడు. అతనే తన పంటకు గడ్డి మందు కొట్టి నాశనం చేసినట్లు ఆరోపిస్తూ రోదించాడు. తనకు ఎలాగైనా న్యాయం జరిగేలా చూడాలంటూ హుజురాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దెబ్బతిన్న పంటను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.