- పంట దిగుబడి రాక పురుగుల మందు తాగిన మరో రైతన్న
- సిద్దిపేట జిల్లాలో విషాదం
- నల్గొండ జిల్లాలో అప్పుల బాధతో పత్తి రైతు బలవన్మరణం
దుబ్బాక, సిద్దిపేట రూరల్, వెలుగు: మూడు బోర్లు వేసినా చుక్క నీరు పడకపోవడంతో మనో వేదనకు గురైన ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన కంకనాల లక్ష్మయ్య(67) తనకున్న రెండెకరాల్లో మంగళవారం రాత్రి మూడు బోర్లు వేశాడు. ఒక్కదాంట్లోనూ నీరు పడలేదు. మూడు బోర్లకు రూ.లక్షన్నర ఖర్చు చేసినా నీరు పడకపోవడంతో కుంగిపోయాడు. వేసిన బోర్లకు అయిన అప్పులు ఎలా తీర్చాలన్న బాధతో మంగళవారం రాత్రి తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లేసరికి లక్ష్మయ్య చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. లక్ష్మయ్య భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.
సిద్దిపేట జిల్లా రంగధాంపల్లిలో...
ఆర్థిక ఇబ్బందులకు తోడు పంట దిగుబడి రాక సిద్దిపేట జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట అర్బన్ మండలం రంగధాంపల్లికి చెందిన రాగం రఘు (58) వ్యవసాయం చేసేవాడు. ఇటీవల కురిసిన వడగండ్ల వానకు దిగుబడి అనుకున్నంతగా రాలేదు. పెట్టిన పెట్టుబడి కూడా రాదని మనోవేదనకు గురైన రఘు మంగళవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి కొడుకు రాగం శశాంక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు.
అప్పుల బాధతో పత్తి రైతు..
కట్టంగూర్ (నకిరేకల్ ): పత్తి పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక నల్గొండ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కట్టంగూరు ఎస్సై రాజు కథనం ప్రకారం..కట్టంగూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మీర్ సాహెబ్ గూడెం గ్రామానికి చెందిన పర్నే నర్సిరెడ్డి (48) 15 ఏండ్ల నుంచి తనకున్న ఐదెకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. రెండేండ్ల నుంచి పత్తి పంటలో దిగుబడులు రాకపోవడంతో నష్టాలు వచ్చి అప్పుల పాలయ్యాడు. మానసిక క్షోభకు గురైన నర్సిరెడ్డి అప్పులు ఎలా తీర్చాలన్న బెంగతో మంగళవారం రాత్రి తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నార్కట్ పల్లిలోని కామినేని దవాఖానకు తరలించారు. అయితే, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.