అప్పుల భారంతో ఓ యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో పెంట కుమారస్వామి (36) ములుకనూరు సహకార సంఘంలో డ్రైవర్ గా పని చేస్తూనే వ్యవసాయం చేస్తున్నాడు. తనకున్న 2 ఎకరాల్లో పత్తి, వరి సాగు చేశాడు. పొలంలో రెండు బోర్ల కోసం రూ. 3 లక్షల వరకు అప్పు చేశారు. పంట విక్రయించినా ఆశించినంత ఆదాయం రాలేదు.
దీంతో చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆ రైతు తీవ్ర మనస్థాపానికి గురైయ్యారు. రాత్రి తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుమారస్వామి ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలానికి చేరుకొని బావి వద్ద పరిశీలించగా అపస్మారక స్థితిలో కనిపించాడు. అతడిని హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. భార్య మౌనిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.