మునుగోడు, వెలుగు : కొడుకు చేతిలో తండ్రి హత్యకు గురైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన ప్రకారం.. చండూర్ మండలం చొల్లేడు గ్రామానికి చెందిన కట్కూరి రామచంద్రం(63)కు నలుగురు కొడుకులు, కూతురు ఉన్నారు. అతని భార్య ధనమ్మ 14 ఏండ్ల కింద మృతి చెందింది. రామచంద్రం తన ఎకరం భూమిని సాగు చేసుకుంటూ ఫంక్షన్లకు వంట పనికి వెళ్తుంటాడు. పెద్ద కొడుకు నరసింహ రెండో భార్య కుటుంబ గొడవల కారణంగా కొన్నేండ్ల కింద ఆత్మహత్య చేసుకోగా.. తండ్రి కొడుకుపై కేసు అయింది.
కేసు వాపస్ తీసుకునేందుకు నరసింహకు రూ. లక్ష అప్పుగా తండ్రి ఇప్పించాడు. ఆ అప్పు తీర్చమని కొడుకును అడుగుతుండగా వినిపించుకోకుండా గొడవపడేవాడు. సోమవారం సాయంత్రం ఇంటి వద్ద కొడుకును అప్పు ఎప్పుడు తీరుస్తావని అడిగాడు. మద్యం మత్తులో ఉన్న నరసింహ తండ్రితో గొడవ పడుతూ గొడ్డలితో నరకడంతో రామచంద్రం స్పాట్ లో చనిపోయాడు. చండూర్ సీఐ వెంకటయ్య వెళ్లి పంచనామా చేసి, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడని గాలింపు చేపట్టామని సీఐ తెలిపారు.