ఖానాపూర్, వెలుగు: సంక్రాంతి పండగకు ఇంటికి వస్తున్న కొడుకును తీసుకెళ్లేందుకు వెళ్తూ.. కారు అదుపు తప్పి జరిగిన ప్రమాదంలో రిటైర్డ్ టీచర్ చనిపోయారు. ఈ ఘటన దస్తురాబాద్ మండలంలో జరిగింది. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగ కోసం ఆదిలాబాద్‌నుంచి ఇంటికి వస్తున్న తన కొడుకును ఇందన్పల్లి నుంచి తీసుకొచ్చేందుకు మండలంలోని బూత్కూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎ.ప్రభాకర్(62) ఆదివారం ఉదయం తన కారులో బయల్దేరారు.
బూత్కూర్, మున్యాల్ గ్రామాల మధ్యలోని ఓ మూల మలుపు వద్ద కారు అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ప్రభాకర్‌ను జగిత్యాలలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. బోగి పండుగ రోజున ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచి వేశాయి.