పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం దర్గా చెరువులో మూడు రోజుల వ్యవధిలో ఇద్దరి మృతదేహాలు దొరికాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రేటర్వరంగ్లోని శంభునిపేటకు చెందిన తస్లీమా(23), తన్వీర్ భార్యాభర్తలు. ఈ నెల1న ఇద్దరూ గొడవపడగా, తస్లీమా తన కొడుకు తన్మూర్(8 నెలలు)ను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వారి కోసం ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.
తస్లీమా తల్లి ఫాతిమా మిల్స్ కాలనీ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్కేసు నమోదు చేశారు. కాగా శుక్రవారం అన్నారం దర్గా చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరికింది. పోలీసులు తస్లీమాగా గుర్తించారు. బాలుడు తన్మూర్ ఆచూకీ లభించకపోవడంతో, వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, మిల్స్ కాలనీ సీఐ సురేశ్, ఎస్సైలు వీరభద్రరావు, వెంకన్న ఆదివారం అన్నారం దర్గాచెరువులోనే గాలింపు చేపట్టగా తన్మూర్ మృతదేహం దొరికింది. మృతురాలి భర్త తన్వీర్ప్రస్తుతం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.