కలెక్టర్ బూట్లు మోసిన బంట్రోత్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్​ 

  • క్రిస్​మస్ ​వేడుకల సాక్షిగా ఘటన

భూపాలపల్లి అర్బన్, వెలుగు : జిల్లా ప్రథమ పౌరుడిగా ప్రజలకు ఆదర్శప్రాయంగా నిలవాల్సిన కలెక్టరే తన బూట్లను బంట్రోతుతో మోయించిన సంఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది.  క్రిస్​మస్ వేడుకల సాక్షిగా శనివారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరలయ్యింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో  శనివారం ఓ చర్చిలో క్రిస్​మస్​ వేడుకలకు నిర్వహించారు. దీనికి ప్రభుత్వ ఆహ్వానితులుగా కలెక్టర్ భవేష్ మిశ్రా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి హాజరయ్యారు.

చర్చి లోపలికి అనుకోకుండా బూట్లతో వెళ్లారు. కాసేపటికి బూట్లతో లోపలికి వచ్చాననే అవగాహనకు రాగానే కలెక్టర్ తన షూ తీసి పక్కనే ఉన్న బంట్రోత్​కు ఇచ్చారు. ఆ అటెండర్ బూట్లను బయటికి తీసుకెళ్లడమే గాక కలెక్టర్​బయటకు వచ్చే దాకా వాటిని మోసుకుంటూ ఉన్నాడు. అక్కడే ఉన్న కొందరు ఫోన్లతో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్​గా మారింది.