రైల్వే ఉద్యోగి.. రైలు కింద పడి ఆత్మహత్య

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ లోని యమ్నాంపేట రైల్వే స్టేషన్ సమీపంలో విషాద ఘటన జరిగింది. ఓ రైల్వే ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందరు చూస్తుండగానే పట్టాలపై పడుకున్నాడు. ఆ వెంటనే అతివేగంతో రైలు ఉద్యోగిపై నుంచి వెళ్లిపోయింది.  రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

యమ్నాంపేట రైల్వే స్టేషన్ లో రాజేందర్ గ్యాంగ్ మెన్ గా పని చేస్తున్నాడు. ఘట్ కేసర్ ఈడబ్యూఎస్ కాలనీలో రాజేందర్ నివాసముండేవాడు. అయితే తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలియడంతో భావోద్వేగానికి లోనయ్యాడు. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే రాజేందర్ ఎలాగైనా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను పని చేస్తున్న రైల్వే స్టేషన్ లోని ట్రాక్ పై పడుకున్నాడు.

ALSO READ :చావనైనా చస్తాం కానీ.. రైల్వే లైన్ వేయనియ్యం

ఇంతలో ఓ రైలు వచ్చి అతడి పైనుంచి వెళ్లడంతో  అతడు అక్కడికక్కడే చనిపోయాడు. అతని శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఆరోగ్య సమస్యల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.