రాత్రికి రాత్రే హౌస్ పర్మిషన్లు.. నస్పూర్ మున్సిపల్ కమిషనర్ టి.రమేశ్ నిర్వాకం

రాత్రికి రాత్రే హౌస్ పర్మిషన్లు..  నస్పూర్ మున్సిపల్ కమిషనర్ టి.రమేశ్ నిర్వాకం

ఈ నెల 5 నుంచి 14 వరకు మెడికల్ లీవ్
13న జనగామ జిల్లా చేర్యాలకు ట్రాన్స్​ఫర్ 
ఆ మరుసటి రోజే హడావుడిగా పర్మిషన్లు జారీ 
గతంలోనూ రమేశ్​పై పలు ఆరోపణలు

మంచిర్యాల, వెలుగు: నస్పూర్ మున్సిపాలిటీలో హౌస్ పర్మిషన్ల బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొన్నటిదాకా ఇక్కడ మున్సిపల్ కమిషనర్​గా పనిచేసిన తన్నీరు రమేశ్ ఇటీవల జనగామ జిల్లా చేర్యాలకు బదిలీ అయ్యారు. అప్పటికే మెడికల్ లీవ్​లో వెళ్లిన ఆయన.. ఇక్కడి నుంచి పోతూపోతూ హడావుడిగా అర్ధరాత్రి వరకు హౌస్ పర్మిషన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో వేల రూపాయలు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తుండగా.. అసలు పర్మిషన్ల జారీలో రూల్స్ పాటించారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

లీవ్​లో వెళ్లి బదిలీ అయినా..

ఈనెల 1 నుంచి 4 వరకు మెడికల్ లీవ్​లో ఉన్న మున్సిపల్ కమిషనర్ రమేశ్ దానిని 5 నుంచి 14 వరకు పొడిగించుకున్నారు. రెవెన్యూ ఆఫీసర్ కె.సతీశ్​కు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. శానిటేషన్ మెయింటెనెన్స్, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్స్ నిర్వహణతో పాటు అత్యవసర మీటింగులకు అటెండ్ అవడం, ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం వరకే ఆయనకు బాధ్యతలు ఇచ్చారు. ఇదిలా ఉండగా, ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా 74 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నందకిశోర్ ఆర్డర్స్ జారీ చేశారు. రమేశ్ చేర్యాల మున్సిపల్ కమిషనర్​గా ట్రాన్స్​ఫర్ చేశారు. ఆయన నస్పూర్​లో రిలీవ్ కాకుండానే చేర్యాలలో జాయిన్ అయ్యారు. 

14న హౌస్ పర్మిషన్లు జారీ

మెడికల్ లీవ్​లో వెళ్లడంతో పాటు నస్పూర్ నుంచి ట్రాన్స్​ఫర్ అయిన తెల్లారి ఈ నెల 14న రమేశ్ ఆగమేఘాల మీద 9 హౌస్ పర్మిషన్లు జారీ చేశారు. ఆ రోజు వరకు ఆయన మున్సిపాలిటీకి రాలేదు. కానీ హౌస్ పర్మిషన్ల కోసం టీఎస్ బీ పాస్​లో సెల్ఫ్ అసెస్​మెంట్ సమర్పించిన వాటికి పలు లొసుగులను ఉపయోగించి పర్మిషన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై రమేశ్ ను వివరణ కోసం ఫోన్ చేస్తే స్పందించలేదు. 14 వరకు ఇన్​చార్జిగా ఉన్న రెవెన్యూ ఆఫీసర్ కె.సతీశ్​ను సంప్రదించగా.. హౌస్ పర్మిషన్లు ఎవరు జారీ చేశారో తనకు తెలియదన్నారు. కమిష నర్ రమేశ్​పై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చాయి. గవర్నమెంట్, అసైన్డ్ భూముల్లో హౌస్ పర్మిషన్లు ఇవ్వడంతో పాటు ఇండ్లు లేని ఖాళ్లీ స్థలాల్లో హౌస్ నంబర్లు ఇచ్చినట్టు పలువురు ఆరోపిస్తున్నారు.  

హౌస్ పర్మిషన్లు ఇవే..

కమిషనర్ రమేశ్ ఈ నెల 14న సాయంత్రం 5 నుంచి రాత్రి 11 గంటల మధ్య ఇచ్చిన హౌస్ పర్మిషన్లు ఇవి.. 358947/ఎన్ఏఎస్పీ/0398/2023 ఠాకూర్ అనూష (సాయంత్రం 5.37 గంటలు), 364103/ఎన్ఏఎస్పీ/0027/2024 జి.లత, జి.శ్రీనివాస్ (సాయంత్రం 5.40 గంటలు), 365715/ఎన్ఏఎస్పీ/0037/2024 పూదరి తిరుపతి (సాయంత్రం 5.48 గంటలు), 366796/ఎన్ఏఎస్పీ/0038/2024 మల్కరెడ్డి క్రాంతికుమార్ (సాయంత్రం 5.49 గంటలు), 366818/ఎన్ఏఎస్పీ/0041/2024 గడ్డం చొక్కారెడ్డి (సాయంత్రం 5.56 గంటలు), 367229/ఎన్ఏఎస్పీ/0042/2024 కర్ర వీరవెంకట సత్యనారాయణ (రాత్రి10.19 గంటలు), 369461/ఎన్ఏఎస్పీ/0051/2024 బండారి సుధాకర్ (సాయంత్రం 6.05 గంటలు), 369569/ఎన్ఏఎస్పీ/0053/2024 బండారి సుధాకర్ (సాయంత్రం 6.07 గంటలు), 371705/ఎన్ఏఎస్పీ/0066/2024 చిదురపు సమ్మక్క (రాత్రి 10.20 గంటలు). 

ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలి.. 

నస్పూర్ మున్సిపల్ కమిషనర్ రమేశ్ ఈ నెల 1 నుంచి14 వరకు మెడికల్ లీవ్​లో ఉన్నారు. 13న చేర్యాలకు ట్రాన్స్​ఫర్ అయ్యారు. అయినప్పటికీ 14న అర్ధరాత్రి వరకు 9 బిల్డింగులకు ఎలా పర్మిషన్లు ఇచ్చారు? ఉన్నతాధికారులు స్పందించి ఎంక్వయిరీ చేయాలి. రూల్స్​కు విరుద్ధంగా పర్మిషన్లు జారీ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ రమేశ్​పై చర్యలు తీసుకోవాలి.