తండ్రిని చంపిన మైనర్​ కొడుకు.. నిందితుడిని పట్టించిన కుక్క

  • మర్డర్ ​చేసి 3 కిలోమీటర్ల దూరంలో బట్టలు, సుత్తి పడేసిండు
  • వాసన పసిగట్టి పట్టించిన పోలీసు జాగిలం 
  • భద్రాద్రి జిల్లా సారపాకలో ఘటన 

బూర్గంపహాడ్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సారపాకలో జల్సాలకు అలవాటుపడిన మైనర్​ కొడుకు తండ్రినే చంపేశాడు. ఈ ఘటనలో సాక్ష్యాధారాలను మాయం చేయగా పోలీసు జాగిలం నిందితుడిని పట్టించింది. ఐటీసీ ఫ్యాక్టరీలో క్యాజువల్ కార్మికుడిగా పనిచేస్తున్న జాఫర్ రఫీ(38) మసీద్ రోడ్డులో ఉంటున్నాడు. ఇతడికి భార్య, కొడుకు, బిడ్డ ఉన్నారు. ఈ మధ్య  ఇతడి మైనర్ ​కొడుకు (16) జల్సాలకు అలవాటు పడ్డాడు.

మత్తుకు బానిస కావడంతో శుక్రవారం రాత్రి కొడుకుతో పాటు భార్యను కూడా మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న కొడుకు శనివారం తెల్లవారుజామున పడుకున్న తండ్రి జాఫర్ రఫీ తలపై సుత్తితో కొట్టి హత్య చేశాడు. తర్వాత రక్తం మరకలు అంటిన బట్టలను, సుత్తిని ఓ సంచిలో పెట్టి మూడు కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో పడేసి వచ్చి ఏమీ తెలియనట్టు పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత రక్తపు మడుగులో ఉన్న భర్తను చూసిన భార్య అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ టైంలో మైనర్ ​బాలుడు అందరితో పాటు అక్కడే ఉన్నాడు. కొత్తగూడెం నుంచి వచ్చిన పోలీసు  జాగిలం వాసన పసిగట్టి  మూడు కిలోమీటర్ల దూరంలోని బట్టలు పడేసిన ప్రాంతానికి వెళ్లి ఆగింది. అక్కడి సంచిలో బాలుడి బట్టలు, సుత్తి దొరికాయి. వాటి ఆధారంగా బాలుడిని విచారించగా తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. కాగా, ఈ హత్యలో మృతుడి భార్య పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్,  సీఐ నాగరాజు, ఎస్ఐ సంతోష్​పరిశీలించారు.

నిజంగా బంగారమే...

రఫీ హత్య కేసులో నిందితుడిని పట్టించిన డాగ్​ పేరు గోల్డీ...ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని  ఎస్పీ ఆఫీసులో ఉంటోంది. వయస్సు రెండున్నరేండ్లే అయినా ఇప్పటివరకు మూడు హత్య కేసుల్లో నిందితులను పట్టించి పోలీసులకు సాయం చేసింది.