- ఉరేసుకుందన్న భర్త
- అదనపు కట్నం కోసం భర్తే చంపాడన్న తల్లిదండ్రులు
- ఆరు నెలల కిందటే పెండ్లి
- అంతలోనే విషాదం
కూకట్పల్లి, వెలుగు: సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన హైదరాబాద్ లోని కేపీహెచ్బీ పీఎస్ పరిధి శంషీగూడలో జరిగింది. మృతురాలి భర్త తన భార్య ఉరి వేసుకుందని చెప్తుండగా, కట్నం కోసం భర్తే హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం నందిపేటకు చెందిన రావుల సుప్రియారెడ్డి(26)కి, అదే జిల్లా దేవరకద్ర మండలం లక్ష్మీరెడ్డిపల్లికి చెందిన ఎం. రాఘవేంద్రరెడ్డితో గత మార్చిలో పెండ్లి జరిగింది.
పెండ్లి కొడుక్కి కట్న కానుకలుగా రూ. 50 లక్షల నగదు, 50 తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. ఆ తర్వాత నవ దంపతులు హైదరాబాద్ వెళ్లి కేపీహెచ్బీ పరిధి శంషీగూడలో ఉంటూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా పని చేస్తున్నారు. అయితే, పెండ్లి అయిన నెల నుంచే రాఘవేంద్రరెడ్డి అదనపు కట్నం కోసం భార్యని వేధించడం మొదలుపెట్టాడు. పుట్టింటి నుంచి మూడెకరాల పొలం రాయించుకురావాలని, భార్య జీతం కూడా తన అకౌంట్లో జమ చేయాలని ఒత్తిడి చేశాడు. దీంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి.
ఈ విషయాన్ని సుప్రియా రెడ్డి పలుమార్లు తన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడింది. పుట్టింటికి వస్తానని వేడుకుంది. దీంతో ఆమెకు తల్లి నచ్చజెప్పింది. అల్లుడికి కూడా నచ్చచెప్పటానికి ప్రయత్నం చేయగా భార్యతో పాటు అత్త మీద కూడా రాఘవేంద్రరెడ్డి చేయి చేసుకున్నాడు. ఈనెల 11న సుప్రియారెడ్డి తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఇక్కడ ఉండలేనని పుట్టింటికి వస్తానని చెప్పింది. అదే రోజు రాత్రి చుట్టుపక్కల వారు సుప్రియారెడ్డి ఉరి వేసుకుందని ఆమె తల్లిదండ్రులు బుచ్చిరెడ్డి, కవితలకు ఫోన్ చేసి చెప్పారు.
ఆ సమయంలో రాఘవేంద్రరెడ్డి డ్యూటీకి వెళ్లారని చెప్పారు. దీంత ఆందోళన చెందిన వారు అదే రోజు రాత్రి కేపీహెచ్బీ పీఎస్కు వచ్చారు. రాత్రి 8 గంటలకు తమ కూతురు ఫోన్లో తమతో మాట్లాడిందని, అంతలోనే ఉరి వేసుకుని చనిపోయే ఆస్కారం లేదని అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడే ఉరి వేసి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని కంప్లయింట్ చేశారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక అసలు విషయం తెలుస్తుందని పోలీసులు అంటున్నారు.