- అవమానాన్ని భరించలేక బాధితురాలి ఆత్మహత్య
- మరో ఇద్దరితో కలిసి బాబాయ్ వరుసయ్యే వ్యక్తి ఘాతుకం
- పరారీలో ముగ్గురు నిందితులు
- వాళ్ల ఇండ్లపై గ్రామస్తుల దాడి.. కారు, బైక్‌ల దహనం
- ముగ్గురినీ ఎన్‌కౌంటర్ చేయాలంటూ ధర్నా
బాలానగర్/రాజాపూర్/జడ్చర్ల/జడ్చర్ల టౌన్, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. పదో తరగతి చదువుతున్న గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు. వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి.. మరో ఇద్దరితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అవమాన భారాన్ని భరించలేక బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. కోపోద్రిక్తులైన బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుల ఇండ్లపై దాడులకు పాల్పడ్డారు. కారు, బైక్‌లను తగులబెట్టగా.. ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
రెండు రోజులు కాపుకాసి..
మహబూబ్‌నగర్ జిల్లా ఉమ్మడి బాలానగర్ మండలం తిర్మలగిరి గ్రామానికి బాలిక (15).. పదో తరగతి చదువుకుంటున్నది. వారం కిందట బంధువు డెలివరీ కావడంతో ఇంట్లో వారందరూ చూడటానికి బుధవారం హైదరాబాద్ వెళ్లారు. ఇంట్లో బాలిక ఒక్కతే ఉంటున్నది. ఈ విషయాన్ని వరుసకు చిన్నాన్న అయ్యే శ్రీను నాయక్ అలియాస్ చిన్న (25) గమనించాడు. రెండు రోజులపాటు ఇంటి వద్ద కాపుకాశాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఎవరూ లేని టైం చూసి అదే గ్రామానికి తండాకు శ్రీను (25), చిన్నరేవల్లికి చెందిన మెకానిక్ శివ (30)తో కలిసి బాలిక ఇంట్లోకి చొరబడ్డారు. బాలికపై ముగ్గురూ గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు బాలిక తన తండ్రికి ఏడ్చుకుంటూ ఫోన్ చేసింది. ‘నాన్నా నీతో మాట్లాడాలి’ అంటూనే ఫోన్ కట్ చేసింది. కంగారుపడ్డ తల్లిదండ్రులు హుటాహుటిన ఊరికి చేరుకున్నారు. ఇంట్లోకి వచ్చి చూస్తే.. బాలిక ఉరికి వేలాడుతూ కనిపించింది.
ఇంటి ముందున్న బైక్ ఆధారంగా..
ఏం జరిగిందనే విషయంపై తల్లిదండ్రులు ఆరా తీయగా.. గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ ‘అర్ధరాత్రి మీ ఇంటి ముందు శ్రీనునాయక్ బైక్ కనిపించింది’ అని చెప్పాడు. తొలుత ఇంట్లో నుంచి ఇద్దరు బయటికి వచ్చారని, అర గంట తర్వాత బైక్‌పై మరోసారి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి వెళ్లారని స్థానికులు చెప్పారు. దీంతో బాధితులు శ్రీనునాయక్ ఇంటికి వెళ్లి చూడగా.. అక్కడ అతడు లేడు. పరారీలో ఉండటంతో తన బిడ్డపై అత్యాచారం చేసి హత్య చేశారని బాలిక తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. శ్రీను నాయక్, తండాకు శ్రీను చెందిన బైకులను తగుటబెట్టారు. వారి ఇండ్లకు నిప్పు పెట్టే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి చిన్నరేవల్లిలోని శివ ఇంటి వద్దకు చేరుకొని అతడి కారును ధ్వంసం చేసి, నిప్పంటించారు. విషయం తెలుసుకున్న జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప, బాలానగర్ ఎస్ఐ జయప్రసాద్ గ్రామానికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య బాలిక డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల గవర్నమెంట్హాస్పిటల్కు తరలించారు.
కఠినంగా శిక్షిస్తం: జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
బాలికను అత్యాచారం చేసి, హత్య చేసిన దుండగులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చెప్పారు. శనివారం ప్రభుత్వ ఆస్పత్రిలో మార్చురీ వద్ద బాలిక డెడ్‌బాడీని పరిశీలించి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, ఐజీతో మాట్లాడినట్లు తెలిపారు.
న్యాయం చేయాలంటూ ధర్నా
తమకు న్యాయం చేయాలంటూ బాధితులు జడ్చర్లలో ధర్నా చేపట్టారు. నిందితులను తక్షణమే ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ నేతాజీచౌరస్తాలోని నాగర్ కర్నూల్ ప్రధాన రహదారిపై భైఠాయించారు. బాలికకు న్యాయం జరిగే వరకు కదిలేదిలేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు. బాధితులకు అండగా పీసీసీ కార్యదర్శి అనిరుధ్ రెడ్డి, బీఎస్పీ నేత బాలవర్ధన్ గౌడ్ ధర్నాకు దిగారు. పరిస్థితి తీవ్రంగా మారుతుండటంతో జిల్లా ఎస్పీ అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని శాంతింపజేశారు. పోస్టుమార్టం జరిగితేనే విషయం బయటకు వస్తుందని, వచ్చిన రిపోర్ట్ ప్రకారం నిందితులకు ఎలాంటి శిక్ష పడాలో ఆ విధంగా కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అన్ని విధాలుగా ఆదుకునేలా చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో బాధితులు ఆందోళన విరమించారు.