మెదక్, చిలప్‌చెడ్, వెలుగు: ఎస్ఐ మానసికంగా వేధిస్తున్నాడంటూ మహిళా ఏఎస్ఐ సూసైడ్ నోట్ రాసి స్టేషన్ లోనే ఆత్మహత్యకు యత్నించిన ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చిలప్‌చెడ్ పోలీస్ స్టేషన్లో రెండేండ్ల నుంచి ఏఎస్ఐగా సుధారాణి డ్యూటీ చేస్తోంది. బుధవారం రాత్రి- 9:30 గంటల సమయంలో ఆమె పోలీస్ స్టేషన్లోనే చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా.. ఓ కానిస్టేబుల్ చూసి రక్షించారు. అనంతరం ఆమెను పోలీసులు సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి చికిత్స అందించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉంది. సూసైడ్ అటెంప్ట్ కు ముందు సుధారాణి రాసిన సూసైడ్ లెటర్లో .. ఎస్ఐ యాదగిరి తనను మానసికంగా వేధిస్తూ లోబర్చుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. స్టేషన్లో అందరిని ఒకలా, తనను మరోలా చూస్తున్నారని, రెండు, మూడు రోజులు కంటిన్యూగా డ్యూటీ చేసి ఒక రోజు రెస్ట్ తీసుకున్నా ఆబ్సెంట్ వేస్తున్నారని పేర్కొన్నారు. తను ఆత్మహత్యకు ఎస్ఐ యాదగిరినే కారణమని ఆ లెటర్ లో తెలిపారు. ఘటనపై ఎస్ఐ యాదగిరి వివరణ కోరగా.. ఏఎస్ఐ సుధారాణి చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని ఖండించారు. భర్తతో ఆమెకు గొడవలు ఉన్నాయన్నారు. బుధవారం పంచాయితీ ఉందని, ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుని ఉంటుందన్నారు.