సంగారెడ్డి:నకిలీ బంగారం బిస్కెట్ ఇచ్చి..రూ.4లక్షలతో భార్యభర్తలు పరారైన సంఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పీఎస్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. మా దగ్గర బంగారం బిస్కెట్ ఉంది. కూతురు వివాహం పెట్టుకున్నాం.. డబ్బు అవసరం పడింది..ఈ బంగారు బిస్కెట్ తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇప్పించాలని నమ్మబలికి మోసానికి పాల్పడ్డారు భార్యాభర్తలు. నిజమని నమ్మి ఆ బంగారు బిస్కెట్ తీసుకుని రూ.4లక్షలు ఇచ్చిన మహిళ.. బిస్కెట్ నకిలీదని తెలుసుకొని లబోదిబోమని పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే..
అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లికార్జున నగర్ కాలనీలో నివాసముంటున్న రాజేశ్వరి అనే మహిళ స్థానికంగా కిరాణా షాపు నడుపుతోంది. రాజేశ్వరి దగ్గర నిత్యం కిరాణా సరుకులు తీసుకునేందుకు రమణమ్మ ఆమె భర్త వచ్చేవారు. ఈ క్రమంలో కూతురు వివాహం చేయాలి.. డబ్బులు కావాలి అని రాజేశ్వరిని అడిగారు భార్యాభర్తలు.. తమ దగ్గర షూరిటీగా గోల్కోండ కేబుల్ నెట్ వర్క్ తవ్వకాల్లో దొరికిన బంగారం బిస్కెట్ ఉంచుతామని నమ్మబలికారు. నిజమని నమ్మిన రాజేశ్వరీ.. నకిలీ బంగారు బిస్కెట్ తీసుకొని వారికి 4లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చింది.
ఐదురోజుల తర్వాత ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చిన రాజేశ్వరి ..ఆరా తీయగా పారిపోయినట్లు తెలిసింది. దీంతో బంగారు బిస్కెట్ తీసుకెళ్లి గీటు పెట్టించగా నకిలీదని తేలడంతో లబోదిబోమని అమీన్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న అమీన్ పూర్ స్టేషన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.