నర్సింహులపేట(దంతాలపల్లి)/ముషీరాబాద్, వెలుగు: ఇటీవల విడుదలైన గ్రూప్4 ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని ఓ యువతి సూసైడ్చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన గాదరబోయిన బక్కయ్య, భిక్షమమ్మ కూతురు శిరీష(24) పీజీ పూర్తి చేసింది.
మూడేండ్లుగా హైదరాబాద్ జవహర్‌నగర్ కాలనీలోని ప్రైవేట్హాస్టల్లో ఉంటూ గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతోంది. టీఎస్పీఎస్సీ ఇటీవల గ్రూప్–4 ఫలితాలు విడుదల చేయగా, అందులో శిరీషకు మార్కులు తగ్గాయి. గతంలో రాసిన పరీక్షల్లోనూ మార్కులు తగ్గడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి శుక్రవారం రాత్రి తాను ఉంటున్న హాస్టల్లో ఉరివేసుకుంది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. శనివారం సాయంత్రం పెద్దముప్పారంలో శిరీష అంత్యక్రియలు నిర్వహించారు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.