- 4.10 ఎకరాలు స్వాధీనం చేసుకున్న రెవెన్యూ ఆఫీసర్లు
- 312 ఎకరాల్లో అనుమతి లేకుండా ప్లాట్లు చేసిన సంస్థ
- 700 ఎకరాల భూదాన్ ల్యాండ్‌పై కోర్టులో కేసు
యాదాద్రి, వెలుగు: ప్రభుత్వం చేపట్టిన భూసర్వేలో అక్రమాలు బయటపడుతున్నాయి. రియల్ఎస్టేట్వ్యాపారులు సీలింగ్ల్యాండ్ను కబ్జా చేసి వెంచర్లు వేసిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. యాదాద్రి జిల్లా కేంద్రంగా రియల్‌ఎస్టేట్‌వ్యాపారం చేసిన ‘నార్నే’ సంస్థ వెంచర్లలో సీలింగ్ల్యాండ్స్ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఈ మేరకు గురువారం 4.10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు.
1985 నుంచి ‘నార్నే’ వ్యాపారం
నార్నే రియల్ ఎస్టేట్ సంస్థ 1985 నుంచి యాదాద్రి జిల్లా కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తోంది. జిల్లాలోని బీబీనగర్ నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అవుశాపూర్ (ఘట్కేసర్) వరకు ‘ఈస్ట్ సిటీ’ పేరుతో వేలాది ఎకరాల్లో రియల్ వ్యాపారం చేసింది. అయితే ఈ సంస్థ పలు భూముల్లో అక్రమాలకు పాల్పడ్డట్లు గతం నుంచీ ఆరోపణలు ఉన్నాయి. ఈ సంస్థపై పలువురు బాధితులు కోర్టుల్లో కేసులు కూడా వేశారు.
సీలింగ్ ల్యాండ్ గుర్తింపు
అడిషనల్ కలెక్టర్ భాస్కర్‌రావు, భువనగిరి ఆర్డీవో అమరేందర్, ఇతర రెవెన్యూ అధికారులు గురువారం బీబీనగర్ పరిధిలోని నార్నే రియల్ ఎస్టేట్‌సంస్థ భూముల్లో సర్వే చేశారు. 254, 256 సర్వే నెంబర్లలోని భూమిని కొలతలు వేసి.. 4.10 ఎకరాల సీలింగ్భూమి ఉన్నట్టు గుర్తించారు. అనంతరం దాన్ని స్వాధీనం చేసుకొని హద్దురాళ్లు పాతారు. అలాగే ఈ భూమిని అప్పట్లో ఇద్దరు వ్యక్తులకు అసైన్ట్ చేసినట్టు గుర్తించిన ఆఫీసర్లు.. వారికి నోటీసులు ఇచ్చారు. కాగా, ఈ భూమిని అమ్మినట్టు తమకు తెలియదని వారసులు చెప్పడం గమనార్హం.
145 ఎకరాల సొమ్ము కోర్డులో డిపాజిట్
బీబీనగర్‌లో ఏర్పాటు చేసిన ఎయిమ్స్ కోసం నార్నే రియల్ఎస్టేట్ నుంచి ప్రభుత్వం 145 ఎకరాలను కొనుగోలు చేసింది. అయితే ఈ భూములు వివాదంలో ఉండడంతో ప్రభుత్వం రూ. 1.21 కోట్లను కోర్టులో డిపాజిట్ చేసింది.
అనుమతి లేకుండా 312 ఎకరాల్లో వెంచర్
బీబీనగర్ మండలం పడమటి సోమారంలో ఎలాంటి అనుమతులు లేకుండా నార్నే ఎస్టేట్ ప్లాట్లు చేసి విక్రయించింది. ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం ప్రకారం.. 1991–-92 వరకు సర్వే నెంబర్లు 38, 39 నుంచి 270 వరకు వివిధ నెంబర్లలో రైతులు పట్టాదారులుగా ఉన్నారు. ఆ తర్వాత నార్నే ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలోని ‘ఈస్ట్ సిటీ’ పేరు వచ్చింది. ఆ తర్వాత ప్లాట్లుగా మారి 1992-93 నుంచి ఇతర వ్యక్తులకు విక్రయించారు. అయితే రైతుల వద్ద కొంత భూమిని మాత్రమే కొని మిగిలిన భూమిని కలిపేసుకున్నారని, ఇలా 312 ఎకరాల్లో ప్లాట్లు చేసి విక్రయించారని ఆఫీసర్ల విచారణలో తేలింది. దీనికి సంబంధించి నార్నే ఎస్టేట్ ప్రతినిధులతో ఆఫీసర్లు మాట్లాడినా పూర్తి వివరాలు అందించలేదని తెలిసింది.
700 ఎకరాలకు పైగా భూదాన్ భూములు
సీలింగ్భూములతో పాటు ఇందులో భూదాన్ భూములు ఉన్న విషయం మరోసారి బయటకు వచ్చింది. భూమిలేని నిరుపేదలకు 1952లో భూదాన్ భూముల పంపిణీ జరిగింది. అయితే ఈ భూములను లబ్ధిదారుల్లో కొందరి నుంచి నార్నే రియల్ ఎస్టేట్ సంస్థ తీసుకుంది. ఇలా ఇప్పటి వరకు 700 ఎకరాలకు పైగా భూదాన్ భూములతో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెవెన్యూ ఆఫీసర్లు గతంలోనే గుర్తించారు. ఈ భూములకు సంబంధించిన ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది.