ఐఎన్​సీ ఓఐఎస్ కు ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ అవార్డు

ఐఎన్​సీ ఓఐఎస్ కు ప్రతిష్టాత్మక సుభాష్ చంద్రబోస్ అవార్డు
  • డిజాస్టర్ మేనేజ్మెంట్​లో నిస్వార్థ సేవలకు గాను కేంద్ర పురస్కారం

న్యూఢిల్లీ, వెలుగు: ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ -హైదరాబాద్ (ఐఎన్​సీ ఓఐఎస్) కు ప్రతిష్టాత్మకమైన సుభాష్ చంద్రబోస్ ఆప్డా ప్రభందన్ పురస్కార్ అవార్డు దక్కింది. 2025 ఏడాదికి గాను కేంద్ర హోం శాఖ గురువారం ఈ అవార్డును ప్రకటించింది. 

డిజాస్టర్స్ మేనేజ్మెంట్ లో వ్యక్తిగతంగా, సంస్థలు చేసిన నిస్వార్థ సేవలను గుర్తించి.. ప్రతియేటా కేంద్రం ఈ అవార్డులతో సత్కరిస్తోంది. గతేడాది జులై నుంచి ఈ అవార్డుల కోసం ఆహ్వానాలు కోరినట్టు కేంద్రం తెలిపింది. 

దేశ వ్యాప్తంగా మొత్తం 295 నామినేషన్లు వచ్చినట్టు వెల్లడించింది. ఇందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అత్యుత్తమ, నిస్వార్థ సేవలను అందించిన ఐఎన్​సీ ఓఐఎస్ ను సుభాష్ చంద్ర బోస్ ఆప్డా ప్రభందన్ పురస్కార్ కు ఎంపిక చేసినట్లు స్పష్టం చేసింది.

10 నిమిషాల్లో సునామీ హెచ్చరికల్ని అందిస్తోంది..

హైదరాబాద్ లో 1999 లో స్థాపించిన ఐఎన్​సీ ఓఐఎస్ దేశ విపత్తు నిర్వహణ వ్యూహంలో అంతర్భాగంగా ఉందని కేంద్రం వెల్లడించింది. సముద్ర సంబంధిత ప్రమాదాల కోసం ముందస్తు హెచ్చరికలలో ఈ సంస్థ ప్రత్యేకతను కలిగి ఉంది. 

ఇండియన్ సునామీ ఎర్లీ వార్నింగ్ సెంటర్ (ఐటీఈడబ్ల్యూసీ) వ్యవస్థతో 10 నిమిషాల్లో సునామీ హెచ్చరికలను అందిస్తుంది. హిందూ మహా సముద్రంతో కనెక్ట్ అయిన భారత్ తో పాటు 28 దేశాలకు ఇది సేవలందిస్తోంది. సునామీ సర్వీస్ ప్రొవైడర్ గా యునెస్కో సైతం ఈ సంస్థను గుర్తించింది. 

భూకంప కేంద్రాలు, టైడ్ గేజ్‌‌‌‌లు, ఇతర సముద్ర సెన్సార్‌‌‌‌ల నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ కు ఇది మద్దతిస్తోంది. 2013 ఫైలిన్, 2014 హుదుద్ తుఫాను సమయంలో అందించిన సలహాలు, సహాయంతో సకాలంలో ప్రజల తరలింపు, తీరప్రాంత ప్రమాదాలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది.