దేశంలోని మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరిగింది. పదేళ్లక్రితం దేశ మధ్యతరగతి ప్రజల ఆదాయం రూ.4.4 లక్షలు ఉంటే గతేడాది వీరి ఆదాయం రూ. 13 లక్షలకు చేరుకుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది.
గత 10 ఏళ్లలో దేశంలోని మధ్యతరగతి ప్రజల సగటు ఆదాయం ఎంత పెరిగిందనే అంశంపై 'డీసీఫరింగ్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ ఐటీఆర్ ఫైలింగ్' అనే పేరుతో SBI ఓ నివేదికను ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం 2012-13 ఆర్థిక సంవత్సరంలో మధ్య తరగతి వారి సగటు ఆదాయం రూ. 4.4 లక్షలుగా ఉండగా.... 2021 -23 ఆర్థిక సంవత్సరంనాటికి దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 13 లక్షలకు చేరింది.
2011 అసెస్ మెంట్ ఇయర్ లో ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన 1.6 కోట్ల మందిలో దాదాపు 84 శాతం మంది రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారేనని SBI నివేదిక వెల్లడించింది. అయితే 2023 అసెస్ మెంట్ ఇయర్ నాటికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన 6.85 కోట్ల మందిలో 64 శాతం మంది మాత్రమే రూ. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారుగా పేర్కొంది. అంటే ఈ కాలంలో 13.6 శాతం మంది తక్కువ ఆదాయ వర్గం నుండి ఉన్నత ఆదాయ వర్గం స్థాయికి చేరుకున్నట్లు SBI నివేదిక స్పష్టం చేసింది.
2047 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు 25 శాతం మంది పన్ను చెల్లింపుదారులు అత్యల్ప ఆదాయ వర్గం నుంచి బయటపడతారని SBI నివేదిక పేర్కొంది. ఇందులో భాగంగా 17.5 శాతం మంది రూ. 5 లక్షల ఆదాయం వర్గం నుంచి రూ. 10 లక్షల ఆదాయ వర్గానికి మారతారని ప్రకటించింది. మరో 5 శాతం మంది రూ. 10 లక్షల ఆదాయం నుంచి రూ. 20 లక్షల ఆదాయ వర్గానికి, మరో 3 శాతం మంది రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షల ఆదాయ వర్గంలో చేరిపోతారని SBI ప్రకటించింది.
దేశంలో 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు రూ. 5 లక్షల నుంచి- రూ.10 లక్షల ఆదాయం పొందే వారు 8.1 శాతం పెరిగారు. . అలాగే రూ. 10 లక్షల నుంచి -రూ. 20 లక్షల ఆదాయ పొందే వారు 3.8 శాతం పెరిగారు. రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలు ఆదాయ అర్జించేవారు 1.5 శాతం మంది పెరిగినట్లు SBI నివేదిక స్పష్టం చేసింది. "రూ. 50 లక్షలు నుంచి -రూ. 1 కోటి ఆదాయ పొందేవారిలో 0.2 శాతం అధికంగా చేరారు. రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయ వర్గంలో 0.02 శాతం మంది చేరినట్లు ఈ నివేదిక పేర్కొంది. అలాగే 2047 ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు 0.5 శాతం మంది ఐటి రిటర్న్ దాఖలు చేసే వారు రూ. 50 లక్షల నుంచి -రూ. 1 కోటి ఆదాయ వర్గంలో చేరుతారని..0.075 శాతం మంది రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయ వర్గానికి మారతారని ఎస్బీఐ అంచనా వేసింది.
దేశంలో ప్రస్తుతం భారతీయ శ్రామిక శక్తి 530 మిలియన్లు ఉంటే..2047 ఆర్థిక సంవత్సరం నాటికి 725 మిలియన్లకు పెరుగుతుందని SBI నివేదిక అంచనా వేసింది. దీని కారణంగా 2023 లో ఐటీఆర్ ఫైల్ చేసే వారి సంఖ్య 37.9 శాతం ఉంటే, అది 2047 నాటికి 45 కోట్లకు పెరుగుతుందని నివేదిక తెలిపింది.