యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు .. సండే ఒక్కరోజే  రూ.58.58 లక్షల ఆదాయం

  • యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు 
  • ధర్మదర్శనానికి నాలుగు గంటలు 
  •  స్పెషల్ దర్శనానికి గంటన్నర టైం
  • సండే ఒక్కరోజే  రూ.58.58 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో.. హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. రద్దీ కారణంగా స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. ధర్మదర్శనానికి  4 గంటలు, స్పెషల్ దర్శనానికి గంటన్నరకు పైగా టైం పట్టింది. స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీఐపీ టికెట్ల ద్వారా 3600 మంది భక్తులు, బ్రేక్ దర్శనాల ద్వారా 1618 మంది స్వామిని దర్శించుకున్నారు. పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా రూ.58,58,934  ఆదాయం సమకూరింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.23,04,100, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.8,06,450, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.6.50 లక్షలు, వీఐపీ దర్శనాలతో రూ.5.40 లక్షలు, బ్రేక్ దర్శనాలతో  రూ.4,85,400, సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.2,25,800, సువర్ణపుష్పార్చనతో రూ.2,12,760 ఆదాయం వచ్చిందని ఆలయ ఆఫీసర్లు తెలిపారు.