Tax News: బాంబ్ పేల్చిన నిర్మలమ్మ.. పన్ను అధికారులకు గూగుల్-వాట్సాప్ యాక్సెస్..

Tax News: బాంబ్ పేల్చిన నిర్మలమ్మ.. పన్ను అధికారులకు గూగుల్-వాట్సాప్ యాక్సెస్..

Income Tax Bill 2025: ఇప్పటికే దేశంలోని ఆదాయపు పన్ను అధికారులు టాక్స్ ఎగవేతదారులను కనిపెట్టడానికి నూతన సాంకేతికత ఏఐ టూల్స్ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి అనుగుణంగా ఆదాయపు పన్ను చట్టంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టడం ద్వారా అక్రమార్కులను పట్టుకోవటానికి మరిన్ని డిజిటల్ ఆధారాల అన్వేషణకు మార్గం సుగమం చేసుకుంటోందని తెలుస్తోంది. ఈ చర్యలు పన్ను ఎగవేతదారులకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.

ALSO READ | ఆన్‌‌‌‌లైన్ యాడ్స్‌‌‌‌పై తొలగనున్న డిజిటల్ ట్యాక్స్‌‌‌‌

కొత్త ఆదాయపు పన్ను బిల్లు, 2025 కింద డిజిటల్ ఆస్తులను ట్రాక్ చేయడానికి చట్టపరమైన నిబంధనలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం మార్పులు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. గతంలో ఉన్న ఆదాయపు పన్ను చట్టాలు ఈ తనిఖీలకు యాక్సెస్ ఇవ్వనందునే దానికి తగినట్లుగా ప్రస్తుతం తెస్తున్న కొత్త చట్టంలో మార్పులను చేసినట్లు ఆమె పేర్కొన్నారు. అక్రమార్కులను అడ్డుకోవటానికి చట్టపరమైన మద్దతు అవసరమనీ లోక్‌సభలో ఆర్థిక బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ ఆర్థిక మంత్రి మార్పులను సమర్థించారు. 

ALSO READ | Market Closing: లాభాలను నిలబెట్టుకోలేకపోయిన మార్కెట్లు.. ఐటీ స్టాక్స్ సూపర్ పెర్ఫామెన్స్..

వాస్తవానికి లెక్కల్లో చూపించని నల్లధనాన్ని వెలికితీయటానికి డిజిటల్ ఫోరెన్సిక్స్ కీలక పాత్ర పోషించిందని ఈ సందర్భంగా వెల్లడించారు. మొబైల్ ఫోన్లలో ఎన్ క్రిప్ట్ చేయబడిన మెసేజ్ల విశ్లేషణ ద్వారా లెక్కల్లో చూపని రూ. 250 కోట్ల డబ్బును అధికారులు దర్యాప్తులో గుర్తించినట్లు ఆమె పేర్కొన్నారు. క్రిప్టో ఆస్తుల వాట్సాప్ సందేశాల నుండి ఆధారాలు కనుగొన్నట్లు తెలిపారు. వాట్సాప్ కమ్యూనికేషన్ రూ. 200 కోట్ల లెక్కల్లో లేని డబ్బును వెలికితీయడానికి సహాయపడిందని అందువల్ల ప్రజల డిజిటల్ ఫుట్ ప్రింట్స్ పన్ను అధికారులకు కీలకంగా వ్యవహరిస్తున్నాయని ఆమె నొక్కి చెప్పారు. ఈ డబ్బును దాచిపెట్టడానికి నిందితులు తరచుగా ట్రావెల్ చేసిన ప్రదేశాల వివరాలను గూగుల్ మ్యాప్స్ హిస్టరీ నుంచి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే బినామీ ఆస్థిని నిరూపించటానికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను విశ్లేషించినట్లు తెలిపారు. 

ఇకపై కొత్త ఆదాయపు పన్ను బిల్లు అధికారులకు ప్రజల ఇమెయిల్స్, వాట్సాప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్ ఇవ్వనుంది. అలాగే ఆర్థిక లావాదేవీలను దాచడానికి వ్యాపారాలు ఉపయోగించే ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, స్టోరేజ్ సర్వర్‌లను యాక్సెస్ చేయడానికి అనుమతిని చట్టం కల్పించనుందని తెలుస్తోంది. డిజిటల్ అకౌంట్స్ నుండి ఆధారాలను సేకరించడం కోర్టు ముందు పన్ను ఎగవేతను నిరూపించడానికి మాత్రమే కాకుండా, పన్ను ఎగవేతల ఖచ్చితమైన మొత్తాన్ని లెక్కించడానికి ఈ చర్యలో తోడ్పాటును అందిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రజలకు పన్ను ఎగవేత నోటీసులు కూడా వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.