- హైదరాబాద్‌లో ఎనిమిది ప్రాంతాల్లో ఆకస్మిక సోదాలు
- దిల్ రాజుకు చెందిన ఎస్‌వీసీ సహా మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో రెయిడ్లు
- ఫైనాన్సియర్స్ రంగయ్య, అభిషేక్ ఇండ్లలోనూ తనిఖీలు
- గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, పుష్ప2 లెక్కలపై ఫోకస్
- ఐటీ చెల్లింపుల రికార్డులు సీజ్
హైదరాబాద్, వెలుగు: ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ షాక్ ఇచ్చింది. ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థలు సహా సినీ ఫైనాన్సియర్స్ ఆదాయ వ్యవహారాలు, ఐటీ చెల్లింపుల వివరాలు సేకరిస్తున్నది.
పుష్ప2, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన పెట్టుబడులపుపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా దిల్ రాజు ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో దాడులు చేసింది.
కేంద్ర బలగాల బందోబస్తు మధ్య తెల్లవారుజాము నుంచే 58 మంది సభ్యులతో కూడిన బృందాలు సోదాలు నిర్వహించాయి. ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించిన ఐటీ చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్స్, ఆడిట్ రిపోర్ట్స్ సహా బ్యాంక్ లాకర్స్‌లోని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
దిల్ రాజుతో పాటు మైత్రీ మూవి మేకర్స్, నిర్మాతలకు ఫైనాన్స్ చేసే బడా ఫైనాన్సియర్స్ ఇండ్లపై కూడా ఐటీ అధికారులు రెయిడ్స్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని మైత్రీ మూవీ మేకర్స్ కార్పొరేట్ ఆఫీస్‌తో పాటు నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇండ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
మరోవైపు మ్యాంగో సంస్థల యజమానులు యరపతినేని రామ్ సహా ఆయా కార్పొరేట్ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్సియర్‌గా వ్యవహరించే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇండ్లు, ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించారు.
వీరిద్దరూ దిల్‌రాజు, మైత్రీ మూవీ మేకర్స్ సహా భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేస్తున్నారు. ఈ సోదాల్లో ఆయా ప్రొడక్షన్ హౌస్‌లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, ఐటీ రికార్డులు, బ్యాలెన్స్ షీట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద ఆర్థికలావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లతో తమ ముందు హాజరుకావాలని వారికి ఐటీ అధికారులు సూచించారు.
దిల్ రాజు ప్రొడక్షన్స్‌పై ఐటీ గురి..
ప్రధానంగా గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలపై ఐటీ నజర్ పెట్టింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో గల దిల్ రాజు ఇంటితో పాటు శ్రీనగర్ కాలనీలోని ఆయన ప్రొడక్షన్ హౌస్ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లో తనిఖీలు చేసింది.
జూబ్లీహిల్స్ కొండాపూర్‌లోని దిల్ రాజు సోదరుడు శిరీష్, ఆయన కూతరు హన్సిత ఇండ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపారు. దిల్ రాజు దగ్గరి బంధువులు, స్నేహితుల ఇండ్లలో కూడా తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో భాగంగా దిల్ రాజు భార్య తేజస్వినిని జూబ్లీహిల్స్‌లోని సెంట్రల్ బ్యాంక్‌కు తీసుకెళ్లారు.
బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయించారు. పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. అనుమానాస్పద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.ఇటీవల విడుదలైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ప్రొడ్యూసర్, ఫైనాన్సియర్‌గా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు.
వీటితో పాటు బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాకు కూడా డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో పాటు ఇప్పటికే రూ.వందల కోట్ల కలెక్షన్ వచ్చింది. దీంతో ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వీటీ ఆర్థిక లావాదేవీలపై ఫోకస్ పెట్టింది.