- మరో నిర్మాత నెక్కంటి శ్రీధర్‌పై కూడా ఐటీ నజర్
- దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియాలో రెండో రోజూ తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: టాలీవుడ్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ రెయిడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమైన సోదాలు బుధవారం కూడా కొనసాగాయి. మొదటి రోజు సోదాల్లో దిల్ రాజు ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ఆధారంగా.. బుధవారం ఉదయం నుంచి పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ సహా మరికొంత మంది డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరిపారు.
సుకుమార్‌తో పాటు మరో బడా నిర్మాత నెక్కంటి శ్రీధర్ ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. భారీ బడ్జెట్ సినిమాల ఆదాయం, పన్ను చెల్లింపుల్లో అవకతవకల కారణంగా టాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ ఆధారంగా ఐటీ సోదాలు ముమ్మరం చేసింది. పుష్ప 2కు వచ్చిన రూ.1,800 కోట్లలో డైరెక్టర్లకు వాటాలు వచ్చినట్టు ఐటీ అనుమానిస్తున్నది.
హార్డ్ డిస్క్‌లు, ఆడిట్ రిపోర్టులు స్వాధీనం..!
భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి.. ఐటీ చెల్లింపుల్లో అవకతవకలను అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే కొండాపూర్‌లోని సుకుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. అప్పటికే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరిన సుకుమార్.. ఐటీ సోదాల విషయం తెలిసి తిరిగి ఇంటికి వచ్చారు. సుకుమార్ ఇంటితో పాటు భైరవం, అఖండ సినిమా నిర్మాత నెక్కంటి శ్రీధర్ ఇల్లు, ఆఫీసుల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు చెందిన మైత్రీ నవీన్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాములు, ఫైనాన్సియర్స్ సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లలోనూ మంగళవారం నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలకు అయిన ఖర్చు, వచ్చిన వసూళ్లు తదితర అంశాలపైనే ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. సోదాల సందర్భంగా ఐటీ చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లు, హార్డ్ డిస్క్‌లు, ఆడిట్ రిపోర్టులు ఐటీ అధికారులు సేకరించినట్టు సమాచారం.