
Prithviraj Sukumaran: ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు తాజాగా ఆదాయపు పన్ను అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆయన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐటీ అధికారులు ఆయన 2022లో నటించి, సహనిర్మాతగా వ్యవహరించిన మూడు సినిమాలు జనగణమణ, గోల్డ్, కడువ సినిమాల విషయంలో చేపట్టిన దర్యాప్తులో భాగంగా ప్రస్తుతం నోటీసులు అందుకున్నారు.
గతంలో విడుదలైన సినిమాల వ్యవహారంలో ఆయన సంపాదించిన ఆదాయ వివరాలను కోరుతూ నోటీసులు అందించినట్లు వెల్లడైంది. గతనెల చివరి వారంలో కొచ్చిలోని ఐటీ విభాగం నటుడికి నోటీసులు జారీ చేసినట్లు వెల్లడైంది. ఏప్రిల్ నెలాఖరులోపు పన్ను అధికారులు అడిగిన ప్రశ్నలకు తన స్పందనను పృథ్వీరాజ్ సుకుమారన్ సమర్పించాల్సి ఉంది. అలాగే పృథ్వీరాజ్ సహనిర్మాతగా పనిచేసిన కొన్ని సినిమాలకు సంబంధించి వివరణలు కూడా అడిగింది. మెుత్తం మీద ఆయన 2022లో చేపట్టిన ప్రాజెక్టుల నుంచి వచ్చిన ఆదాయం గురించి పన్ను అధికారులు కూపీ లాగుతున్నారు.
అధికారులు నటుడికి మార్చి 29న మెయిల్ ద్వారా నోటీసులు జారీ చేసినట్లు వెల్లడైంది. అయితే సాధారణ అసెస్మెంట్ నిర్వహిస్తుండగా నటుడికి సంబంధించిన 2022 టాక్స్ ఫైలింగ్స్ పరిశీలించినప్పుడు గుర్తించిన కొన్ని వ్యత్యాసాలపై జవాబు కోరుతూ నోటీసులు పంపారు. వీటిపై వివరణను ఏప్రిల్ 29 నాటికి సమర్పించాలని వారు కోరారు. ఇది కొనసాగుతున్న L2: ఎంపురాన్ వివాదానికి సంబంధించినదిగా కనిపించినప్పటికీ, ఇది ప్రామాణిక విధానపరమైన నోటీసు అని, సాధారణంగా వివరణలు అవసరమైనప్పుడు ఇలాంటి నోటీసులను ఐటీ అధికారులు జారీ చేస్తుంటారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
2022లో నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో వ్యత్యాసాలు ఉన్నాయనే అనుమానంతో అధికారులు ఆయన ఇల్లు, ఆఫీసుతో పాటు నిర్మాణ సంస్థలో సోదాలు చేసినప్పటి నుంచి ఆదాయపు పన్ను శాఖ ఆయనపై నిఘా ఉంచింది. ఆంటోనీ పెరుంబవూర్, లిస్టిన్ స్టీఫెన్, ఆంటో జోసెఫ్ వంటి ప్రముఖ నిర్మాతలు కూడా ఆ సమయంలో ఇలాంటి ఐటీ అధికారుల నుంచి రెయిడ్స్ చూశారు. పన్ను ఎగవేత, లెక్కల్లో చూపని నగదు లావాదేవీలు, విదేశాల్లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులకు పాల్పడ్డారనే ఆరోపణలపైనా దాడులు జరిగాయి.
మోహన్ లాల్ నటించిన ఎల్2 ఎంపురాన్ సినిమాలో పుృథ్వీరాజ్ చేసిన క్యారెటర్ జాయిద్ మసూద్ 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధాన్ని కలిగి ఉండటంతో సినిమాపై విమర్శలు వచ్చాయి. దీంతో నిర్మాతలు సినిమాలోని కొన్ని సీన్స్ తొలగించారు. అలాగే క్యారెక్టర్ల పేర్లు, డైలాగ్స్ మార్పు వంటివి కూడా జరిగాయి. కానీ దీనికి ప్రస్తుతం పంపిన ఐటీ నోటీసులకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు.