ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే ఫ్రీ రేషన్ కట్.. లిస్ట్ తెప్పించుకుంటున్న కేంద్రం..

ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే ఫ్రీ రేషన్ కట్.. లిస్ట్ తెప్పించుకుంటున్న కేంద్రం..

ఢిల్లీ: మోదీ సర్కార్ ఫ్రీ రేషన్ స్కీం అమలుపై నిఘా పెట్టింది. ఆదాయపు పన్ను శాఖ నుంచి దేశవ్యాప్తంగా ఇన్కం ట్యాక్స్ కడుతున్న వాళ్ల లిస్ట్ తెప్పించుని ఆహార మంత్రిత్వ శాఖ నిఘా పెట్టాలని డిసైడ్ అయింది. వీరికి ఫ్రీ రేషన్ కట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. కనీస ఆదాయం లేని నిరుపేద కుటుంబాలకు మాత్రమే చెందాల్సిన ఫ్రీ రేషన్ స్కీం దుర్వినియోగం అవుతోందని, సంవత్సరానికి లక్షలు సంపాదిస్తున్న వాళ్లు కూడా ఫ్రీ రేషన్ తీసుకుంటున్నారని మోదీ సర్కార్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.

దీంతో.. వీళ్ల సంగతేంటో చూడాలని, ఆదాయపు పన్ను కడుతూ.. కట్టగలిగే స్థోమత కలిగి కూడా ఉచిత రేషన్ పొందుతున్న వారి రేషన్ కార్డులపై నిఘా పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఆదాయపు పన్ను చెల్లిస్తూ ఫ్రీ రేషన్ తీసుకుంటుంటే వారిని ఫ్రీ రేషన్ స్కీంకు అనర్హులుగా ప్రకటించాలని కేంద్రం డిసైడ్ అయింది.

ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన(PMGKAY) పథకం అమలుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 2.03 లక్షల కోట్లు కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 1.97 లక్షల కోట్లు అదనంగా ఈ పథకం అమలుకు నిధులను కేటాయించింది. కోవిడ్-19 ఉపద్రవం వల్ల దేశవ్యాప్తంగా నిరుపేదలు ఆకలి బాధలు చవిచూశారు.

ఇలాంటి నిరుపేదల కోసం ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన స్కీంను కేంద్రం తీసుకొచ్చింది. మార్చి 2020 నుంచి ఈ స్కీం అమలవుతోంది. 80 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ఒక్కో వ్యక్తికి నెలకు 5 కేజీల ఆహార ధాన్యాలను(Rice/Wheat) ఈ పథకంలో భాగంగా రేషన్లో ఉచితంగా అందిస్తున్నారు. జనవరి 1, 2024 నుంచి ఈ స్కీంను మరో ఐదేళ్ల పాటు పొడిగించారు.