మధ్యప్రదేశ్ లో ఐటీ అధికారులు పంజా విసిరారు. ఏకంగా ముఖ్యమంత్రి కమల్ నాథ్ సన్నిహితుల ఇళ్లలోనే సోదాలు చేస్తున్నారు. సీఎం ఓఎస్డీగా పనిచేస్తున్న ప్రవీణ్ కక్కర్ ఇండోర్ నివాసంపై ఐటీ అధికారులు ఆదివారం తెల్లవారుజామున దాడి చేశారు. కక్కర్ నివాసంతో పాటు భోగూ గ్పాల్, ఇండోర్, గోవాలో కూడా దాడులు చేస్తున్నారు. ఒక్క ఢిల్లీలోనే 35 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. దాదాపు 300 మంది ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కమల్ నాధ్ సలహాదారు రాజేంద్రకుమార్ కు చెందిన ఢిల్లీ ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల కోసం హవాలా రూపంలో నగదు తరలిస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో భారీగా నగదు పట్టుబడినట్లు సమాచారం. సీఎం వ్యక్తిగత అధికారులపై ఐటీ దాడులు జరగడం మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతోంది. విపక్ష నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ రావడంతో ఈ ఇద్దరు అధికారులు తమ పదవుల నుంచి తప్పుకున్నారు.
మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాధ్ ఓఎస్డీ నివాసంలో ఐటీ సోదాలు జరపడంపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. విపక్ష పార్టీ నేతలను బీజేపీ టార్గెట్ చేస్తుందని ఆపార్టీ నేత మీమ్ అప్జల్ ఆరోపించారు. ఈడీ, ఐటీ విభాగాలు మోడీ డైరెక్షన్ లో పనిచేస్తున్నాయన్నారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అఫ్జల్ మండిపడ్డారు.