- ఏడాదికి రూ. 80 వేల వరకు మిగులుబాటు
- రైతుల కోసం ‘ధన్ ధాన్య కృషి యోజన’.. కిసాన్ క్రెడిట్ కార్డు లోన్లు రూ. 5 లక్షలకు పెంపు
- మూడేండ్లలో ప్రతి జిల్లా హాస్పిటల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్
- ఎడ్యుకేషన్‌లోకి ఏఐ.. బొమ్మల తయారీకి ప్రత్యేక స్కీమ్
- 2028 నాటికి అందరికీ రక్షిత మంచినీళ్లు..రక్షణ రంగానికి దండిగా పైసలు
- లోక్‌సభలో 2025–26 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మల
- మొత్తం బడ్జెట్ రూ. 50 లక్షల 65 వేల 345 కోట్లు
బడ్జెట్ సమగ్ర స్వరూపం
(రూ. కోట్లలో)
మొత్తం బడ్జెట్ 50,65,345
రెవెన్యూ వసూళ్లు 34,20,409
మూలధన వసూళ్లు 16,44,936
బిజినెస్ డెస్క్, వెలుగు: మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఉద్యోగులకు రిలీఫ్ ఇచ్చింది. సామాన్యులు (ఇండివిజ్యువల్ ట్యాక్స్ పేయర్స్) ఇక నుంచి రూ.12 లక్షల ఆదాయం వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఉద్యోగులకు స్టాండర్డ్ డిడక్షన్ కింద ఇస్తున్న రూ.75 వేలు కూడా కలుపుకుంటే రూ. 12 లక్షల 75 వేల ఆదాయం వరకు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ట్యాక్స్ స్లాబ్స్‌లో కూడా మార్పులు తీసుకువచ్చారు. కొత్త పన్ను విధానంలో ఇస్తున్న రూ.25 వేల ట్యాక్స్ రిబేట్ (రిఫండ్) ను రూ.60 వేలకు పెంచారు. గతంలో రూ.12 లక్షల ఆదాయంపై రూ.80 వేల వరకు పన్ను పడేది. రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే వారికి కూడా తాజా బడ్జెట్‌లో ఉపశమనం దొరికింది. రూ.16 లక్షల ఆదాయంపై ట్యాక్స్ భారం రూ.50 వేలు తగ్గగా.. రూ.20 లక్షల ఆదాయంపై రూ.90 వేలు.. రూ.24 లక్షల ఆదాయంపై రూ.1,10,000 తగ్గింది. కొత్త పన్ను విధానాన్ని ఎన్నుకున్నవారికే ఈ ట్యాక్స్ ప్రయోజనాలు దక్కుతాయి.
ట్యాక్స్ స్లాబ్‌లు మారాయి..
కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లో స్లాబ్‌లను కేంద్ర ప్రభుత్వం సవరించింది. గతంలో రూ.3 లక్షల వరకు బేసిక్ మినహాయింపు ఉండగా, రూ.7 లక్షల వరకు రిబేట్ (ట్యాక్స్ రిఫండ్) ఇచ్చేవారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను గత బడ్జెట్‌లో రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. తాజా బడ్జెట్‌లో బేసిక్ మినహాయింపును రూ.4 లక్షలకు, రిబేట్ లిమిట్‌ను రూ.12 లక్షలకు పెంచారు. స్టాండర్డ్ డిడక్షన్‌ను మార్చలేదు. పాత పన్ను విధానంలో మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు.
ట్యాక్స్ ఎలా, ఎంత పడుతుందంటే?
ఉదాహరణ1:
రమేశ్ అనే ఉద్యోగికి ఏడాదికి రూ.12 లక్షల 75 వేల ఆదాయం వచ్చిందని అనుకుందాం. ఆయనకు ఇతర ఆదాయాలు ఏమీ లేవు. అందువల్ల రమేశ్ మొత్తం ఆదాయం రూ.12.75 లక్షలుగా ఉంది. స్టాండర్డ్ డిడక్షన్ రూ.75 వేలు తీసేస్తే రూ.12 లక్షలపై ట్యాక్స్ పడుతుంది. ఇందులో రూ. 4 లక్షల వరకు బేసిక్ ట్యాక్స్ మినహాయింపు దక్కుతుంది. అంటే రూ.8 లక్షల ఆదాయంపై ట్యాక్స్ లెక్కిస్తారు. కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం.. మొదటి రూ. నాలుగు లక్షలపై రూ.4 లక్షల నుంచి 8 లక్షల ట్యాక్స్ లోని 5 శాతం పన్ను పడుతుంది. అంటే రూ.20 వేలు. ఆదాయంలోని మిగిలిన రూ.4 లక్షలపై ‘రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల ట్యాక్స్’ 10 శాతం పడుతుంది. అంటే రూ.40వేలు. మొత్తంగా రూ.60వేలు ట్యాక్స్ పడుతుంది. ప్రభుత్వం రూ.12 లక్షల ఆదాయం వరకు గరిష్టంగా రూ. 60 వేల ట్యాక్స్ రిబేట్ ఇస్తున్నది కాబట్టి ట్యాక్స్ పేయర్ చెల్లించే పన్ను జీరో అన్నమాట. కొత్త ట్యాక్స్ సిస్టమ్‌లోని ప్రస్తుత రేట్ల ప్రకారం అయితే రమేశ్ రూ.83వేలు ట్యాక్స్ కట్టాలి. బడ్జెట్‌లో ప్రతిపాదించిన మార్పుల వల్ల ఇకపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
ఉదాహరణ 2:
రమేశ్ అనే ఉద్యోగికి ఆదాయం ఏడాదికి రూ.12 లక్షల 75 వేలకు పైగా ఉంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దానిలో కూడా మార్జినల్ కన్సెషన్ ఉంటుంది. రమేశ్ ఆదాయం రూ.12 లక్షల 80 వేలు అని అనుకుందాం. ఇందులో నుంచి రూ.75 వేల స్టాండర్డ్ డిడక్షన్ తీసేస్తే రూ.12,05,000 పైన ట్యాక్స్ లెక్కిస్తారు. ఇందులో రూ.4 లక్షల వరకు బేసిక్ మినహాయింపు ఉంటుంది. రూ.8.05 లక్షలపై ట్యాక్స్ పడుతుంది. మొదటి రూ.4 లక్షలపై ‘రూ.4 లక్షల నుంచి 8 లక్షల ట్యాక్స్’ స్లాబ్‌లోని 5 శాతం పన్ను పడుతుంది. అంటే రూ.20 వేలు. మిగిలిన రూ.4.05 లక్షల ఆదాయంపై ‘రూ.8 లక్షల నుంచి 12 లక్షల ట్యాక్స్’ స్లాబ్‌లోని 10 శాతం పన్ను పడుతుంది. పన్ను రూ.40,000. మిగిలిన రూ.5 వేల ఆదాయంపై ‘రూ. 12 లక్షల నుంచి 16 లక్షలు ట్యాక్స్’ స్లాబ్‌లోని 15 శాతం ట్యాక్స్ పడుతుంది. అంటే రూ.750. మొత్తం ట్యాక్స్ రూ.60,750. కానీ, ట్యాక్స్ రిబేట్ లిమిట్ (రూ.12 లక్షలు)కంటే కేవలం రూ.5 వేలు మాత్రమే ఎక్కువ (ట్యాక్స్ పడే ఆదాయం కంటే) ఉండడంతో మార్జినల్ కన్సెషన్ కింద రూ.5 వేలనే ఇన్‌కమ్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు. అంటే మొత్తం ట్యాక్స్ ఈ రూ.5 వేలే. దీనికి హెల్త్, ఎడ్యుకేషన్ సెస్ కూడా కలుపుకుంటే మొత్తం ట్యాక్స్ రూ.5,400 అవుతుంది. ఇక.. వ్యక్తి ఆదాయం (స్టాండర్డ్ డిడక్షన్‌కు ముందు) రూ.13,45,000 వరకు మార్జినల్ కన్సెషన్ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.
TAX ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఏప్రిల్ 1 తర్వాత ఫైల్ చేసే ఐటీ రిటర్న్‌లకు మాత్రం గతంలోని పన్ను స్లాబ్‌లే వర్తిస్తాయి. తాజాగా మారిన పన్ను స్లాబ్‌లు మాత్రం 2025–26 ఆర్థిక సంవత్సరానికి వాడుకోవచ్చు. అంటే రానున్న ఆర్థిక సంవత్సరం కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ 1 తర్వాత ఫైల్ చేసే ఐటీఆర్‌లకు తాజాగా మారిన ట్యాక్స్ రేట్లు వర్తిస్తాయి.
పాత పన్ను విధానంలో మార్పుల్లేవ్
పాత పన్ను విధానంలో ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. యథాతథంగా ఉంచింది. ఈ విధానంలో రూ.2.5 లక్షల వరకు బేసిక్ మినహాయింపు ఉంది. రూ.5 లక్షల ఆదాయం వరకు ట్యాక్స్ రిబేట్ పొందొచ్చు. 80సీ, 80 డీ వంటి సెక్షన్ల కింద మినహాయింపులు పొందొచ్చు.
మార్చిన శ్లాబ్‌ల ప్రకారం ఆదాయంపై ట్యాక్స్ ఇలా..
0% రూ. 4 లక్షల వరకు
5% 4 నుంచి 8 లక్షలు
10% 8 నుంచి 12 లక్షలు
15% 12 నుంచి 16 లక్షలు
20% 16 నుంచి 20 లక్షలు
25% 20 నుంచి 24 లక్షలు
30% 24 లక్షలపైన
ధరలు తగ్గేవి ..
క్యాన్సర్, ఇతర వ్యాధుల మందులు
ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్
ఇంపోర్టెడ్ కార్లు, బైక్స్
మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్
ఎల్‌సీడీ, ఎల్ఈడీ టీవీలు
ఫ్రోజెన్ చేపలు, చేపల పేస్ట్,సముద్ర ఉత్పత్తులు
లెదర్ ఉత్పత్తులు
ధరలు పెరిగేవి..
స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్
ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు (టీవీలు)
ఉలెన్ దుస్తులు, ఇంపోర్టెడ్ చెప్పులు
పీవీసీ (పాలీవినైల్ క్లోరైడ్) ఉత్పత్తులు
పాత పన్ను విధానంలోని స్లాబ్‌లు ఇలా
ఆదాయం (రూ.ల్లో) పన్ను రేటు
రూ.2.5 లక్షల వరకు జీరో
2,50 లక్షల నుంచి 5 లక్షలు 5%
5 లక్షల నుంచి 10 లక్షలు 20%
కొత్త పన్ను విధానంలో ట్యాక్స్ స్లాబ్‌లు ఇట్ల
ప్రస్తుతం (రూ.ల్లో) పన్ను రేటు ఇకపై (రూ.ల్లో) పన్ను రేటు
3 లక్షల వరకు జీరో 4 లక్షల వరకు జీరో
3 లక్షల నుంచి 7 లక్షలు 5% 4 లక్షల నుంచి 8 లక్షలు 5%
7 లక్షల నుంచి 10 లక్షలు 10% 8 లక్షల నుంచి 12 లక్షలు 10%
10 లక్షల నుంచి 12 లక్షలు 15% 1 2లక్షల నుంచి 16 లక్షలు 15%
12లక్షల నుంచి 15 లక్షలు 20% 16 లక్షల నుంచి 20 లక్షలు 20%
15 లక్షల పైన 30% 20లక్షల నుంచి 24 లక్షలు 25%
24 లక్షల పైన 30%