హైదరాబాద్ : బషీర్ బాగ్ లోని అయాకర్ భవన్ లో ఉన్న ఇన్ కమ్ ట్యాక్స్ టవర్స్ లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఉద్యోగులందరూ ఆఫీసు నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ విషయం పోలీసులకు కూడా ఫిర్యాదు అందడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగి.. ఇన్ కమ్ ట్యాక్స్ టవర్స్ లో అణువణువూ గాలించింది. చివరకు ఇది ఫేక్ కాల్ గా బాంబ్ స్వ్కాడ్ నిర్ధారించింది. బాంబు ఎవరూ పెట్టలేదని తేలడంతో ఐటీ ఉద్యోగులందరూ ఊపీరి పీల్చుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాల్ చేసి భయపెట్టిన అగంతకుడు ఎవరన్నదానిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేస్తూ... స్విచ్ ఆఫ్ చేస్తున్నట్లు గుర్తించారు.
ఇలాంటి తరహా ఘటనలు గతంలోనూ చాలా జరిగాయి. పోలీసులను, బాంబ్ స్వ్కాడ్ సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించిన ఘటనలు చాలా జరిగాయి. గంటల వ్యవధిలోనే ఈ తరహా కేసులను పరిష్కరించి.. నిందితులను కటకటాల్లోకి నెట్టిన విషయం తెలిసిందే.