
- ప్రమాదం అంచున ప్రయాణం.. ఏడాదిన్నర అయినా పూర్తి కాని బ్రిడ్జి
- తాత్కాలిక రోడ్డు పక్కనే లోతైన బావి
- అదుపు తప్పితే ముప్పు తప్పదు
- రక్షణ చర్యలు తీసుకోని అధికారులు
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా రామారెడ్డి దగ్గర గంగమ్మవాగుపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం ఏడాదిన్నర అయినా పూర్తి కాకపోవడంతో వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పోవాల్సివస్తోంది. బ్రిడ్జి పూర్తి కాకపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్డు మీద వాహనాలు వెళ్తున్నాయి. ఈ రోడ్డు పక్కనే పాతకాలం నాటి బావి ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న వాహనాలు లోతైన బావిలో పడే ప్రమాదం ఉంది. అర్ అండ్‌బీ అధికారులు కనీసం అక్కడ హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు.
మండలకేంద్రమైన రామారెడ్డి సమీపంలో ఉన్న గంగమ్మ వాగు మీద బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3 కోట్ల 8 లక్షలు ఆర్అండ్బీ శాఖ సాంక్షన్ చేసింది. 2023లో పనులు మొదలు పెట్టారు. ఏడాదిన్నర కావస్తున్న పనులింకా కంప్లీట్ కాలేదు. పిల్లర్లు, సాబ్ పనులు పూర్తికాగా సైడ్ వాల్స్, ఇరువైపుల రోడ్డు నిర్మాణం జరగాల్సిఉంది. ఆరు నెలల నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఇప్పటికి వాహనాలు తాత్కాలికంగా వేసిన రోడ్డు మీదే వెళ్తున్నాయి. పక్కనే బావి ఉండడంతో వాహనదారులు ఈ రోడ్డు మీద ప్రయాణమంటేనే భయపడుతున్నారు.
ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న వాహనం బావిలో పడే ప్రమాదం ఉంది. కామారెడ్డి నుంచి రామారెడ్డి, మాచారెడ్డి మండల్లాల్లోని పలు గ్రామాలకు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి ఈ రోడ్డు మీదే రోజూ వందల సంఖ్యలో బస్సులు, కార్లు, ఇతర వాహనాలు వచ్చిపోతుంటాయి.
రామారెడ్డిలోని ప్రసిద్ధమైన కాలభైరవ స్వామి టెంపుల్, మద్దికుంట బుగ్గరామేశ్వర ఆలయాలకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అధికారులు రోడ్డు పక్కన ఉన్న బావి చుట్టూ రక్షణ చర్యలు తీసుకోలేదు. కనీసం అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి పనులు వీలైనంత తొందరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆర్అండ్బీ ఈఈ రవిశంకర్ చెప్పారు.