
- మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల తీరు
- రూ.కోట్లతో చేపట్టిన పనులు ఇంకా అసంపూర్తిగానే..
మెదక్/సిద్దిపేట/ సంగారెడ్డి, వెలుగు: మున్సిపాలిటీ పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. పాలక వర్గాల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం, ప్రభుత్వాలు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో అనేక అభివృద్ధి పనులు అసంపూర్తిగానే మిగిలాయి. 2019లో మున్సిపల్ ఎన్నికలు జరుగగా మెజారిటీ మున్సిపాలిటీ చైర్మన్లు బీఆర్ఎస్ వారే ఎన్నికయ్యారు. నాలుగేళ్ల పాటు రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారంలో ఉన్నా, స్థానిక ఎమ్మెల్యేలు ఆ పార్టీ వారే అయినా అభివృద్ధి పనులు పూర్తికాలేదు.
సిద్దిపేట జిల్లాలో..
జిల్లాలో మొత్తం 5 మున్సిపాలిటీలు ఉండగా సిద్దిపేట మినహా దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపల్ పాలక వర్గాల గడువు ముగిసింది. సిద్దిపేట మున్సిపల్ పాలక వర్గం గడువు వచ్చే ఏడాది మే వరకు ఉంది. దుబ్బాక మునిసిపాలిటీ పరిధిలో శ్మశాన వాటికల నిర్మాణానికి రూ.కోటి మంజూరైనా పనులు ప్రారంభించలేదు. కోటి రూపాయలతో నిర్మిస్తున్న అంబేద్కర్ భవన్ పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. రూ.50 లక్షలతో బైపాస్ రోడ్డు పనులు, రూ.25 లక్షలతో నిర్మించే షాపింగ్ క్లాంప్లెక్స్, రూ.50 లక్షలతో వివిధ కుల సంఘాల భవనాలకు టెండర్లు పూర్తయినా పనులు మధ్యలోనే ఉన్నాయి.
హుస్నాబాద్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు అసంపూర్తిగా మిగిలాయి. రూ.6 కోట్లతో ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వివిధ వార్డుల్లో రూ.2 కోట్లతో అంతర్గత రోడ్ల నిర్మాణానికి ప్రారంభోత్సవాలు చేసినా పనులు ప్రారంభించలేదు. చేర్యాల మున్సిపాలిటీలో రూ.3కోట్ల నిధులతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పెండింగ్ లో ఉండగా, పలు వార్డుల్లో మిషన్ భగీరథ పనులు ఇంకా పూర్తి కాలేదు.
రూ. 2 కోట్ల అమృత్ స్కీమ్ పనులు ఇంకా ప్రారంభించలేదు. నాన్ వెజ్ మార్కెట్ షాపులను వ్యాపారులకు అప్పగించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మునిసిపల్ఆఫీసు భవన నిర్మాణ పనులు నిలిచిపోగా, రూ.17 కోట్లతో ఇంటి గ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ పనులు స్లోగా జరుగుతున్నాయి. గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో యూజీడీ పనులు ఇంకా ప్రారంభించలేదు. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇప్పటికి ఇండ్ల పంపిణీ చేయలేదు. పట్టణంలోని ముఖ్యమైన జంక్షన్ల సుందరీకరణ కోసం రూ.2కోట్లు మంజూరైనా కేవలం మూడు చోట్ల మాత్రమే పనులు పూర్తి చేశారు. కోట మైసమ్మ రోడ్డు విస్తరణ , కాలన్ మార్కెట్ పనులు పెండింగ్ లో ఉన్నాయి.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ పట్టణంలో రూ.6 కోట్లతో నిర్మించిన రైతు బజార్ పూర్తయినా ప్రారంభించలేదు. రూ.4.50 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు పిల్లర్ల స్థాయిలోనే ఆగిపోయాయి. రూ.2.50 కోట్లతో చేపట్టిన వైకుంఠ ధామం అసంపూర్తిగానే ఉంది. రూ.20 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ పనులు, రాందాస్ చౌరస్తాలో రూ.3 కోట్లతో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్, పట్టణంలోని ప్రధాన చౌరస్తాల ఆధునికీకరణ పనులు పూర్తి కాలేదు.
పట్టణ పరిధిలో వెయ్యి డబుల్ బెడ్రూం ఇడ్ల నిర్మాణం చేపట్టగా అందులో 500 పంపిణీ చేశారు. మరో 500 ఇళ్లు వివిధ దశల్లో మిగిలిపోయాయి. రామాయంపేటలో రూ.2 కోట్లతో చేపట్టిన మల్లె చెరువు మినీ ట్యాంకు బండ్ పనులు మధ్యలోనే నిలిచి పోయాయి. రూ.4 కోట్లతో చేపట్టిన ఇంటి గ్రేటెడ్ మార్కెట్ పనులు పిల్లర్ల స్థాయిలో నిలిచాయి. రూ.7.50 కోట్ల సిద్దిపేట రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా మిగిలాయి. రూ.కోటితో నిర్మించే వైకుంఠ ధామం పనులు సైతం మధ్యలోనే ఆగిపోయాయి. మున్సిపల్ నూతన భవనానికి సైతం శంకుస్థాపన చేసిన పనులు మాత్రం ప్రారంభించలేదు.
ALSO READ : శాలివాహన పవర్ ప్లాంట్ ఫర్ సేల్!..భూములను అమ్మకానికి పెట్టిన మేనేజ్ మెంట్
తూప్రాన్ మున్సిపాలిటీలోని ఐదో వార్డులో పార్కు నిర్మాణానికి నిధులను కేటాయించారు. కానీ దాని చుట్టూ డ్రైనేజీ నిర్మించి పార్కు పనిని మధ్యలోనే వదిలేశారు. పెద్ద చెరువు కట్ట సమీపంలోనూ అర్బన్ పార్క్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో చుట్టూ ప్రహరీ నిర్మించి వదిలేశారు. కోటి రూపాయలతో పేద ప్రజల కోసం డబుల్ బెడ్ రూమ్ల వద్ద ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసేందుకు 2021లో శంకుస్థాపన చేసి బేస్మెంట్వేసి మధ్యలో వదిలేశారు. అన్ని ఆఫీస్లు ఒకే దగ్గర నిర్మించేందుకు ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కంప్లెక్స్ ను పాత మండల ఆఫీస్ వద్ద రూ.8 కోట్లతో 2022 లో శంకుస్థాపన చేశారు. బిల్డింగ్ పూర్తయినప్పటికీ చిన్న చిన్న పనులు కాక మధ్యలోనే వదిలేశారు. రూ.25 కోట్లతో 504 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించేందుకు 4 ఏళ్ల కింద శంకుస్థాపనలు చేసినప్పటికీ పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో 8 మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటిలో ఒక్క జహీరాబాద్ మినహా మిగతా ఏడు సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్-జోగిపేట, నారాయణఖేడ్, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. సంగారెడ్డి మున్సిపాలిటీలో దశాబ్ద కాలంగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య అలాగే ఉంది. 15 ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించలేదు. జోగిపేట మున్సిపల్ పరిధిలో శ్మశాన వాటిక అసంపూర్తిగా మిగిలిపోయింది.
ఇందుకోసం 2016 -17లో కేటాయించిన రూ.70 లక్షలు వెనక్కి వెళ్లిపోయాయి. పట్టణంలో ఉన్న చౌరస్తాలపై ఐమాక్స్ లైట్లు బిగించలేదు. వడ్డెర, బుడగ జంగాలకు శ్మశాన వాటిక సమస్య అలాగే ఉంది. రూ.50 లక్షల సీసీ రోడ్లు ఇంకా పూర్తి చేయలేదు. తెల్లాపూర్ లో ప్రైమరీ హెల్త్ సెంటర్, నాన్ వెజ్ మార్కెట్ ఎస్టీపీ ప్లాంట్, చెరువుల సుందరీకరణ, గద్దర్ ఆడిటోరియం, స్మృతివనం నిర్మాణాలు అలాగే ఉన్నాయి.
అమీన్ పూర్ బల్దియాలో కొత్త మున్సిపల్ ఆఫీసు నిర్మాణంతో పాటు ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ భవనం పెండింగ్ లో పడింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో దాదాపు అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణం జరిగినా డ్రైనేజీ పనులు వదిలేశారు. టౌన్ లో తాగు నీటి సమస్య, కూరగాయల మార్కెట్, మేకల బజార్లో సదుపాయాల కొరత వంటి సమస్యలు వెంటాడుతున్నాయి.