ఆరు నెలలే అన్నారు.. రెండేండ్లుగా దిక్కులేదు

ఆరు నెలలే అన్నారు.. రెండేండ్లుగా దిక్కులేదు

కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో ఇంటిగ్రేటెడ్​మార్కెట్ల నిర్మాణ పనులు ముందుకు సాగడంలేదు. నిర్మాణం ప్రారంభించి రెండేండ్లు గడిచినా పనులు ఇప్పటికీ స్లాబ్​లెవల్​లోనే ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పనులు ఇలా ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రతి మున్సిపాలిటీలో ఆరు నెలల్లో ఇంటిగ్రేటెడ్​ వెజ్, నాన్​వెజ్ ​మార్కెట్లు నిర్మిస్తామని​ మంత్రి కేటీఆర్​ అసెంబ్లీలో చెప్పి రెండేండ్లు గడుస్తున్నా ఆ మార్కెట్లు నేటికీ అందుబాటులోకి రాలేదు. మంచిర్యాల జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లో చేపట్టిన మార్కెట్ల నిర్మాణ పనుల్లో ఒక్కటి కూడా పూర్తికాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

పనులన్నీ స్లోగా..

కూరగాయలు, పండ్లు, పూలు, మాంసం, చేపల మార్కెట్లను ఒకేచోట ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని వస్తువులు ఒకే దగ్గర అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేడెట్​మార్కెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యేలు, మంత్రులు శంకుస్థాపన చేసి తమ ఘనతగా చెప్పుకున్నారు. కానీ ఆరు నెలల్లో పూర్తిచేస్తామని చెప్పి రెండేండ్లు గడుస్తున్నా వాటిని పట్టించుకోవడంలేదు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ ఆవరణ, రామకృష్ణాపూర్(క్యాతనపల్లి) మున్సిపాలిటీలోని అంబేద్కర్​ వారాంతపు సంత ఎదురుగా, మందమర్రి మున్సిపాలిటీలోని రామన్​ కాలనీ ఎదుట, నస్పూర్​ మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీ వద్ద వారసంత స్థలంలో ఇంటిగ్రేటెడ్ ​మార్కెట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో దానికి రూ.7.2 కోట్ల ఫండ్స్​ కేటాయించారు. చెన్నూరులోని పాత తహసీల్దార్​ భవనం స్థలంలో రూ.7.5 కోట్లు, లక్షెట్​పేట పాత పోలీస్​స్టేషన్​వెనుక రూ.3.90 కోట్లతో, బెల్లంపల్లిలోని కాంటా వద్ద రూ.2 కోట్ల ఫండ్స్​తో చేపట్టిన మార్కెట్ ​నిర్మాణాల్లో ఏ ఒక్కటీ పూర్తి కాలేదు. చాలా స్లోగా సాగుతున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జరుగుతున్న పనులు సైతం నిలిచిపోయాయి.

ప్రస్తుత మార్కెట్లలో వ్యాపారుల అవస్థలు

ఈ మార్కెట్లు పూర్తికాకపోవడంతో చిరు వ్యాపారులు ఎప్పట్లాగే  పాత మార్కెట్లలో వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్నారు. చెట్లు, డేరాల కింద, డ్రైనేజీల పక్కనర, రోడ్లకు ఇరువైపుల నేల మీద తంటాలు పడుతూ అమ్మకాలు సాగిస్తున్నారు. తైబజార్లు, సంతల  వేలంలో రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నా ప్రస్తుత మార్కెట్లలో కనీసం సౌలత్​లు కల్పించడంలో మున్సిపల్​శాఖ, సంబంధిత సంతల నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. మార్కెట్​ప్రాంతాల్లో టాయిలెట్, మరుగుదొడ్ల ఏర్పాటు చేయకపోవడంతో ముఖ్యంగా మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్​నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి తమ కష్టాలు తీర్చాలని వ్యాపారులు కోరుతున్నారు.