కొత్త రైల్వేలైన్లకు నిధులొచ్చేనా..!

కొత్త రైల్వేలైన్లకు నిధులొచ్చేనా..!
  • నేటి బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లా వాసుల ఆశలు 
  • ఇప్పటికే కరీంనగర్- హసన్‌పర్తి, రామగుండం- మణుగూరు లైన్లకు సర్వే పూర్తి
  • ఈసారి నిధులు కేటాయిస్తేనే భూసేకరణ పనులు
  • అసంపూర్తిగా కొత్తపల్లి- మనోహరాబాద్‌  రైల్వే లైన్‌

కరీంనగర్, వెలుగు: కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కనెక్ట్ చేసే రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లొకేషన్ సర్వే పూర్తయిన కరీంనగర్–హసన్‌‌పర్తి, రామగుండం– మణుగూరు రైల్వే లైన్ల భూసేకరణకు, అసంపూర్తిగా ఉన్న కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైన్‌‌కు బడ్జెట్‌‌లో తగినన్ని నిధులు కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది.  ఉమ్మడి జిల్లా పరిధిలోని నిజామాబాద్-–పెద్దపల్లి మార్గం డబ్లింగ్ పనులకు నిధులివ్వాలని, తిరుపతి–కరీంనగర్ వీక్లీని ట్రై వీక్లీ లేదా డైలీ ఎక్స్ ప్రెస్ గా నడపాలని ప్రజలు కోరుతున్నారు.

పూర్తయిన ఫైనల్ లొకేషన్  సర్వేలు.. 

కరీంనగర్–హసన్‌‌పర్తి మధ్య రైల్వే లైన్ ఏర్పాటుకు చేపట్టిన ఫైనల్ లొకేషన్ సర్వే ఆరునెలల కింద పూర్తయింది. అధికారులు డీపీఆర్ కూడా దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్లకు అందజేశారు. సుమారు 61.80 కిలోమీటర్ల నిడివితో  కరీంనగర్– వరంగల్ సిటీలను కలిపే రైల్వే లైన్ ప్రజలకు చాలా ఉపయోగకరంగా మారనుంది. ఈ లైన్ పూర్తయితే హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్,  కేశవపట్నం, మానకొండూరు మండలాల ప్రజలకు రైలు ప్రయాణ  యోగం కలగనుంది. ఈ లైన్ ఏర్పాటు కోసం 2013లోనే సర్వే  చేసినప్పటికీ ఆ తర్వాత అడుగు ముందుకుపడలేదు. 

ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని సింగరేణి, ఏజెన్సీ ఏరియాలను కలుపుతూ ఏర్పాటు చేయబోయే రామగుండం–- మణుగూరు మధ్య  కొత్త  రైల్వే లైన్ ఏర్పాటుకు ఫైనల్ లొకేషన్  సర్వే పూర్తయింది. ఇది ప్రధానంగా బొగ్గు, సరుకు రవాణాకు ఎక్కువగా ఉపయోగపడే ట్రాక్. 207 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే ట్రాక్ ద్వారా పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రాలు అనుసంధానం కానున్నాయి. ఈ లైన్ అందుబాటులోకి వస్తే రామప్ప, మేడారంలాంటి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలకు  కనెక్టివిటీ పెరగనుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి  రైల్వే ఆఫీసర్లు రూ.4 వేల కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. వాస్తవానికి 1999లోనే ఈ  లైన్ ఏర్పాటుకు సర్వే  చేసినప్పటికీ ప్రాజెక్టు పెండింగ్‌‌లో పడగా.. తాజాగా కేంద్రం భూసేకరణకు ఓకే  చెప్పడంతో తిరిగి పట్టాలెక్కింది. 

ఓటాన్​అకౌంట్​బడ్జెట్‌‌లో అరకొర కేటాయింపులు.. 

ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్‌‌ అకౌంట్‌‌ బడ్జెట్‌‌లో కొత్తపల్లి– మనోహరాబాద్‌‌ రైల్వే లైన్‌‌ నిర్మాణ పనులకు రూ.350 కోట్లు మినహా ఉమ్మడి జిల్లా రైల్వే ప్రాజెక్టులకు పెద్దగా నిధులు కేటాయించలేదు. రామగుండం–మణుగూరు కొత్త లైన్ కోసం రూ.5 కోట్లు కేటాయించింది. కరీంనగర్‌‌–హసన్‌‌పర్తి, పెద్దపల్లి– నిజామాబాద్‌‌ రైల్వే మార్గం డబ్లింగ్‌‌ పనులకు పైసా కేటాయించలేదు.  

మరికొన్ని డిమాండ్లు.. 

  • కాజీపేట నుంచి బాసరకు వయా పెద్దపల్లి-, కరీంనగర్- నిజామాబాదు మీదుగా పుష్ ఫుల్ నడపాలి. 
  • 2012లో ప్రారంభించిన ఇంటర్ సిటీ ఎక్స్‌‌ప్రెస్‌‌ తర్వాత కాజీపేట నుంచి సిర్పూర్ కాగజ్‌‌నగర్  మార్గంలో మరో కొత్త  రైలు రాలేదు. ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరగడంతో మరో రైలు నడపాలనే డిమాండ్ వినిపిస్తోంది. 
  • కాజీపేట నుంచి ఆదిలాబాద్ వయా పెద్దపల్లి-మంచిర్యాల-సిర్పూర్ కాగజ్ నగర్-బల్లార్షా మీదుగా ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది.