ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపు

ప్రభుత్వం కీలక నిర్ణయం.. వరద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపు

హైదరాబాద్: గత నాలుగు రోజులుగా కురుస్తోన్న ఎడతెరిపి లేని వర్షాలకు తెలంగాణ అల్లకల్లోలం అయ్యింది. రికార్డ్ స్థాయిలో వర్షాలు కురువడంతో రాష్ట్రంలోని వాగులు, వంకలు, కాలువలు ఉప్పొగించి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వరదలు సంభవించి కొందరు మృతువాత పడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‎గ్రేషియా పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. మృతుల కుటుంబాలకు ప్రస్తుతం అందించే ఆర్థిక సాయాన్ని రూ.4లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 

 వరుణుడి ఉగ్రరూపానికి అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లకు రూ.5 కోట్లు విడుదల చేశారు. వరద బాధితులకు తక్షణ సాయం కోసం సీఎం ఈ ఫండ్స్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలో కురుస్తోన్న వర్షాలు, వరదలపై కమాండ్ కంట్రోల్ సెంటర్‎లో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పై నిర్ణయాలు తీసుకున్నారు. భారీ వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. కలెక్టరేట్లలో కాల్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు వెంటనే స్పందించి పరిహారం అందించాలని చెప్పారు. వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇస్తామని తెలిపారు. అత్యవసర సేవల కోసం 8 పోలీస్‌ బెటాలియన్లకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ తరహాలో శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రివ్యూ మీటింగ్ అనంతరం వర్షాలతో అల్లకల్లోలమైన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. రోడ్డు మార్గాన ఖమ్మం వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.