- ఇంధన శాఖకు రూ.16,410 కోట్లు
- నిరుడు కంటేరూ.3,686 కోట్లు అదనం
- అగ్రికల్చర్ సబ్సిడీకి రూ.11,500 కోట్లు
- నెట్వర్క్పెంపునకు ప్రణాళికలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యుత్ శాఖకు నిధులు పెంచింది. ఇంధన శాఖకు రూ.16,410 కోట్లు కేటాయిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. గత బడ్జెట్‌లో రూ.12,727 కోట్లు కేటాయించగా.. ఈసారి అదనంగా రూ.3,686 కోట్లు కేటాయించింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కు రూ.11,500 కోట్లు కేటాయించింది.
గృహజ్యోతి (200 యూనిట్ల ఫ్రీ పవర్)కి రూ.2,418 కోట్లు అలాట్చేసింది. అలాగే, శరవేగంగా పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ట్రాన్స్ మిషన్ నష్టాలు తగ్గించి.. నెట్ వర్క్ ను బలోపేతం చేయడంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 11 కొత్త ఎక్స్ ట్రా హై టెన్షన్ సబ్ స్టేషన్ల నిర్మాణం, 31 ఎక్స్ ట్రా హై ఓల్టేజ్ పవర్ ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్య పెంపు కోసం రూ.3,017 కోట్ల పెట్టుబడులతో ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఇంధనశాఖపై ప్రగతి పద్దులో పేర్కొన్న అంశాలివే..
విద్యుత్ శాఖకు కేటాయించిన నిధుల్లో ప్రగతి పద్దు కింద రూ.11,905.62 కోట్లు చూపించారు. 2023 –24 బడ్జెట్లో విద్యుత్ శాఖకు కేటాయించిన నిధుల్లో ప్రగతి పద్దు కింద రూ.8,862.75 కోట్లు చూపించారు. అంటే నిరుడు కంటే ఈయేడు రూ.3 వేల కోట్లు ఎక్కువ ప్రగతి పద్దులోనే కేటాయించారు. అందులో వ్యవసాయనికి ఉచిత విద్యుత్‌కు, ఇతర విద్యుత్ సబ్సిడీలకు గాను ట్రాన్స్‌కోకు రూ.8,260 కోట్లు, స్పిన్నింగ్ మిల్లుల కరెంట్ సబ్సిడీకి రూ.50 కోట్లు, గృహజ్యోతి స్కీమ్‌కు రూ.1,825 కోట్లు, విద్యుత్ బాండ్ల కోసం రూ.72 లక్షలు, బయోమాస్ టారీఫ్ ఇంటెన్సివ్స్ కు రూ.10 కోట్లు, డిస్కంలు, ట్రాన్స్‌కో సహాయం కోసం రూ.1,509.40 కోట్లు ఈఆర్సీకి రూ.25 లక్షలు, ఉదయ్ పథకం కింద విద్యుత్ సంస్థలకు ఇచ్చిన హామీలో భాగంగా రూ.250 కోట్లు, తెలంగాణ షవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.25 లక్షలను బడ్జెట్లో కేటాయింపులు చేసింది.
కొత్తగా ఎనర్జీ పాలసీ..
రాష్ట్రంలో భౌగోళిక అనుకూల ప్రాంతాల్లో స్టోరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఇంధన శాఖ మంత్రి భట్టి స్పష్టం చేశారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం 450 చార్జింగ్ స్టేషన్లు ఉండగా.. అదనంగా గ్రేటర్ హైదరాబాద్పరిధిలో 100 చార్జీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
దీని కోసం టీజీఈవీ మొబైల్ యాప్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విద్యుత్ వినియోగ అవసరాల దృష్ట్యా 2030 వరకు విద్యుత్ ఉత్పత్తికి తగిన ప్లాన్ చేస్తున్నామని, సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి కోసం ఒక నూతన ఎనర్జీ పాలసీని తీసుకుని వస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.