వాహనాలు స్పీడ్ లిమిట్ దాటితే వెయ్యి జరిమానా

 వాహనాలు స్పీడ్ లిమిట్ దాటితే వెయ్యి జరిమానా
  • ఎన్నిచోట్ల స్పీడ్ లిమిట్ దాటితే.. అన్ని వేలు జరిమానా
  • జరిమానాతోపాటు కఠిన శిక్షలు కూడా..
  • జీహెచ్ఎంసీ పరిధిలో 3 స్పీడ్ లిమిట్ కేటగిరీలు

హైదరాబాదులో వాహనాల స్పీడ్ లిమిట్ పెరిగింది. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో మొత్తం మూడు స్పీడ్ లిమిట్ కేటగిరీలుగా విభజించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా స్పీడ్ లిమిట్ పై పోకస్ పెట్టారు. వాహనదారులు స్పీడ్ లిమిట్ మించితే... వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. 
గజిబిజీ ట్రాఫిక్ తో సిటీ రోడ్లపై రోజూ లక్షలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఇక సిటీలో రాష్ డ్రైవింగ్ చేసేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. రాత్రి టైమ్ లో ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్లి ప్రమాదాలు చేసే వారు తక్కువేం కాదు. అందుకే ఈ వేగానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ, పోలీసు, రవాణాశాఖ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం వేగ పరిమితులను మూడు కేటగిరీలుగా డివైడ్ చేసింది. గ్రేటర్ పరిధిలో వేగాన్ని నియంత్రిస్తూ మే నెలలో ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
జంట నగరాల్లో ప్రమాదాల తీవ్రత తగ్గించేందుకు అధికారులు ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్, మాదాపూర్ లో  గంటకు 80 కిలోమీటర్లు, అబిడ్స్ రూట్లో 40, ఉప్పల్ లో 50 కిలోమీటర్ల వేగంతోనే వెళ్లాలనే నిబంధనలు ఇకపై ఉండవు. వన్ వే.. టూ వే రహదారులపై వెళ్లే వాహనాలకు మాత్రమే స్పీడ్ లిమిట్ ఉండనుంది.

జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే స్పీడ్ లిమిట్
కొత్తగా వచ్చిన స్పీడ్ లిమిట్ నిబంధనలు జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రమే ఉంటాయి. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలో అన్ని రకాల వాహనాల వేగ పరిమితి ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఉండేది. ఈ వేగాన్ని మించితే ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు వేస్తున్నారు. అయితే తాజాగా ఈ స్పీడ్ లిమిట్ ను పెంచడంతో పాటుగా ఆయా వాహనాల వేగ పరిమితులను వేర్వేరుగా నిర్ణయించారు. దీని ప్రకారం కార్లకు 60 కిలోమీటర్లు, బస్సులు, లారీ, ఆటో, బైక్ లకు 50 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ పెంచారు. అలాగే డివైడర్స్ లేని చోట కార్లకు 50 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్ నిర్ణయించగా.. బస్సులు, లారీలు, ఆటోలు, బైక్ లకు 40 కిలోమీటర్ల లిమిట్ పరిమితం చేశారు. కాలనీల్లో అన్ని రకాల వాహనాలకు 30 కిలోమీటర్ల వేగానికి పరిమితం చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్లైఓవర్లకు మాత్రం 40 కిలో మీటర్ల స్పీడ్ లిమిట్ ఉంటుందని రాచకొండ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్  ప్రదీప్ తెలిపారు. 

రోడ్లపై స్పీడ్ లేజర్ గన్ కెమెరాలు
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ లిమిట్ కు సంబంధించిన నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. రోడ్లపై స్పీడ్ లేజర్ గన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆయా రోడ్లపై ఉన్న స్పీడ్ లిమిట్ ను క్రాస్ చేసి వాహనాలు వేగంగా వెళ్తే... వెయ్యి రూపాయల ఫైన్ వేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఒక్క రోజులో ఎన్ని సార్లు స్పీడ్ లిమిట్ రూల్స్ బ్రేక్ చేస్తే.. అన్ని సార్లు వెయ్యి రూపాయల జరిమానాలు పెరుగుతూ ఉంటాయని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు.
ఇకనుంచి జీహెచ్ఎంసీ పరిధిలో వాహనదారులు రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాల్సిందే... ఇష్టమొచ్చినట్లుగా ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ తో వెళ్తే ... భారీ ఫైన్లు తప్పవు. జరిమానాలతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.