లిక్కర్ పైసలే పెద్దదిక్కు..నెలకు రూ.500కోట్ల అదనపు ఆదాయం

లిక్కర్ పైసలే పెద్దదిక్కు..నెలకు రూ.500కోట్ల అదనపు ఆదాయం

రాష్ట్ర ఖజానాకు లిక్కర్ ఆదాయమే పెద్ద దిక్కుగా మారుతున్నది. ఏటా ఈ రాబడి పెరుగుతున్నది. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు అంటే ఆరేండ్లలో లిక్కర్ ఆదాయం నాలుగు రెట్లు పెరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013–14లో తెలంగాణ జిల్లాల నుంచి లిక్కర్ ద్వారా రూ.9,890 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రం వచ్చిన కొత్తలో ఎక్సైజ్  ఆదాయం  వ్యాట్ తో కలిపి రూ.10,500 కోట్లు ఉండేది. తాజాగా పెంచిన రేట్లతో ఈ ఏడాది రూ.35,226 కోట్లకు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. చాన్స్ దొరికితే పెంచుడే.. లిక్కర్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ ఆదాయాన్ని రాబట్టేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఏ చిన్న అవకాశం వచ్చినా వాడుకుంటోంది. మద్యం షాపుల దరఖాస్తు ఫీజు, లైసెన్స్ ఫీజు, బార్లు, లిక్కర్ ధరలను పెంచుతోంది. కిందటి ఏడాది అక్టోబర్లో జరిగిన వైన్ షాపుల లక్కీ డ్రాతో ఎక్సైజ్ శాఖకు రూ.975 కోట్ల ఆమ్దాని వచ్చింది. రాష్ట్రంలో 2,216 లిక్కర్ షాపులు ఉన్నాయి.

ప్రతి షాపుకు పర్మిట్ రూం ఉంది. గతంలో పర్మిట్ రూమ్కు లక్ష రూపాయలు తీసుకునే వారు. ఇప్పుడు అదే పర్మిట్ రూమ్ కోసం రూ.5 లక్షలు వసూలు చేస్తున్నారు. 6 నెలల్లో రెండుసార్లు పెంపు రాష్ట్రంలో లిక్కర్ ధరలను ఆరు నెలల్లోరెండు సార్లు పెంచారు. గతేడాది డిసెంబర్ లో ప్రభుత్వం లిక్కర్ రేట్లను 20 శాతం పెంచింది. దీంతో ఏడాదికి రూ.4 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. తాజాగా సగటున 16 శాతం ధరలను పెంచారు. దీంతో ప్రతి నెలా రూ.500 కోట్లు అదాయం వస్తుందని, ఏడాదికి రూ.6 వేల కోట్ల అదనపు రాబడి వచ్చే చాన్స్ ఉందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ‘‘2020–21 బడ్జెట్ లో ఎక్సైజ్  ద్వారా రూ.29 వేల కోట్ల అదాయం వస్తుందని అంచనా వేశాం. లాక్ డౌన్ కారణంగా ధరలు పెంచడంతో అదనంగా రూ.6 వేల కోట్లు వస్తాయి. దీంతో రూ.35 వేల కోట్లు లిక్కర్ ద్వారా ఆదాయం వస్తుంది’’ అని చెప్పారు. ఎక్సైజ్ శాఖకు రూ.35 వేల కోట్లు లిక్కర్ ధరల పెంపుతో రాష్ట్ర ఆదాయం బాగా పెరుగనుంది. లిక్కర్ అమ్మకాల ద్వారా నే ఖజానాకు 41 శాతం రాబడి సమకూరనుంది. 2020–-21 బడ్జెట్ లో సొంత పన్నుల ద్వారా రూ.85 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ , స్టాంప్  అండ్ రిజిస్ట్రేషన్, వెహికల్ రిజిస్ట్రేషన్ ద్వారా మెజారిటీ ఆదాయం వస్తుందని పేర్కొంది. మద్యం ధరలను పెంచడంతో అన్ని రకాల పన్నులు కలుపుకుని ఎక్సైజ్ శాఖకు రూ.35 వేల కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉంది.