మే నుంచి కరెంట్ బిల్లుల పెంపు.. మధ్య తరగతిపై భారం

మే నుంచి కరెంట్ బిల్లుల పెంపు.. మధ్య తరగతిపై భారం

బేసిక్​ కరెంట్ చార్జీలు పెంపు?

5 పైసల నుంచి 15 పైసల వరకు పెంచే చాన్స్​

100-200 యూనిట్లకు 50 పైసలు పెరిగే అవకాశం

ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యుత్​ సంస్థలు

త్వరలో ఈఆర్​సీకి అందజేత.. మే నుంచి అమల్లోకి?

హైదరాబాద్‌, వెలుగు: కరెంట్​ చార్జీలను పెంచాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం మే నెల నుంచి వాటిని అమలు చేసే అవకాశం ఉంది. పేద ప్రజలకు భారం పడనివ్వబోమని ఇప్పటికే సీఎం కేసీఆర్​ ప్రకటించారు.అయితే పెరిగే చార్జీల వల్ల మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలపై భారం పడనున్నట్లు తెలుస్తోంది.  ప్రత్యక్షంగా చార్జీల భారం మోపకుండా పరోక్షంగా చార్జీలు పెంచుకునేందుకు విద్యుత్​ సంస్థలకు ప్రభుత్వం అనుమతించినట్లు సమాచారం. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేసిన విద్యుత్‌ సంస్థలు అసెంబ్లీ సమావేశాల అనంతరం చార్జీల టారీఫ్‌ను విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్​సీ)కి అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రతిపాదనలపై ఈఆర్‌సీ 15 రోజుల్లో బహిరంగ విచారణ చేపట్టి అనంతరం టారీఫ్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఏటా పెంచిన కరెంట్​ చార్జీలను ఏప్రిల్‌ 1 నుంచి  అమలు చేస్తారు. గత నవంబర్‌ నెలాఖరుకు చార్జీల టారీఫ్‌ ప్రతిపాదనలను ఈఆర్‌సీకి అందిస్తే విచారణ తదితర ప్రక్రియలు ముగిసి ఏప్రిల్‌ నుంచి చార్జీలు అమలులోకి వచ్చేవి. కానీ ఇప్పటివరకు ప్రతిపాదనలు అందించక పోవడంతో కొత్త చార్జీల అమలుకు మరో నెల రోజులు పట్టే చాన్స్​ ఉంది.

పరిశ్రమలకు పెంచకపోవచ్చు

పరిశ్రమల వర్గాలకు కరెంట్​ చార్జీలు పెంచే చాన్స్‌ తక్కువేనని సమాచారం. ఇప్పటికే ధరలు భరించలేకపోతున్న పరిశ్రమలు.. ఈ సారి పెంచితే క్యాప్టివ్‌ పవర్‌కు మొగ్గుచూపే అవకాశం ఉంది.కాబట్టి ఈ వర్గాలకు చార్జీలు పెంచే యోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. విద్యుత్‌ సంస్థలకు బలమైన వినియోగదారుల్లో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే.. ఇప్పటికే తెలంగాణ విద్యుత్‌ సంస్థల నుంచి కొనుగోళ్లు తగ్గించుకొని ప్రైవేటు నుంచి కొంటున్నట్లు సమాచారం.

మిడిల్‌ క్లాస్‌పై  భారం

గృహ వినియోగదారుల కేటగిరీలోని మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలు 100  నుంచి 200 యూనిట్ల వరకు కరెంటు వాడుతారు. ప్రస్తుతానికి ఈ కేటగిరీలో యూనిట్‌కు రూ. 4.30 పైసలు అమలవుతోంది. దీన్ని 50 పైసలకు పైగా పెంచొచ్చని తెలుస్తోంది. 200 యూనిట్ల కన్నా ఎక్కువగా వాడే గృహ వినియోగదారులపై యూనిట్‌కు రూ. 5 ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. ఈ కేటగిరీలో 50 పైసల నుంచి రూపాయి వరకు పెంచనున్నట్టు తెలుస్తోంది. వాణిజ్య వర్గాలకు రూ. 2 వరకు పెంచే చాన్స్‌ ఉంది.

18 ఏండ్ల తర్వాత పెంపు?

18 ఏండ్లుగా బేసిక్‌ (0‌‌–50 యూనిట్లు) కరెంటు చార్జీలను డిస్కమ్‌లు పెంచలేదు. 2000–01లో బేసిక్‌ చార్జీలు యూనిట్‌కు 80 పైసలు ఉండేది. 2001–02లో యూనిట్‌కు 55 పైసలు పెంచడంతో అది రూ. 1.35కు చేరింది. ఆ తర్వాత 2002–03లో యూనిట్‌కు 10పైసలు పెంచడంతో రూ. 1.45 కు చేరింది. అటు తర్వాత ఇప్పటివరకు బేసిక్‌ చార్జీలు పెంచలేదు. అయితే త్వరలో అమలయ్యే కొత్త చార్జీల టారీఫ్​లో వీటిని పెంచే అవకాశం ఉంది. బేసిక్​ చార్జీల్లో యూనిట్‌కు 5 పైసల నుంచి 15 పైసల వరకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరోవైపు 51–100 యూనిట్ల కరెంట్​కు కూడా 18 ఏండ్లుగా చార్జీలు పెంచలేదు. 2002–03 నుంచి ఇవి యూనిట్‌కు రూ. 2.60గా అమలవుతున్నాయి. వీటిని కొద్ది మేర పెంచే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

For More News..

గుడ్‌న్యూస్.. కరోనా టెస్టులు ఫ్రీ

కట్నం కోసం కరోనా వేధింపులు