- పదవి ఆశిస్తున్న ముగ్గురు లీడర్లు
- హైదరాబాద్ లో మంత్రులు, ప్రభుత్వ విప్, సీనియర్ల చుట్టూ చక్కర్లు
- ఆదిలాబాద్ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డికి ధీటుగా శ్రీకాంత్ రెడ్డి, గణేశ్ రెడ్డి పైరవీలు
- ఈ ముగ్గురిని కాదంటే ఖానాపూర్ ఎమ్మెల్యేకు అవకాశాలు..!
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) పదవి ఆ పార్టీలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రెండు నెలల క్రితం ఈ పదవికి అంతగా పోటీ లేకపోగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో అమాంతం పోటీ పెరిగింది. గతంలో ఈపదవిలో ఉన్న సాజిద్ ఖాన్‌ను ఎన్నికలకు ముందు పార్టీ సస్పెండ్ చేయడంతో అప్పటి నుంచి పోస్టు ఖాళీగానే ఉంది.
పార్లమెంట్ ఎన్నికలకు ముందే పార్టీ అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలున్నాయి. నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో పార్టీ ఆశావహులు పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో మకాం వేసి మంత్రులు, పార్టీ రాష్ట ఇన్చార్జి, సీనియర్లతో మంతనాలు జరుపుతున్నారు.
పెరిగిన పోటీ..
కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం పోటీ పెరిగింది. ముఖ్యంగా డీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందోనని ఉత్కంఠ నెలకొంది. ఆశావహులు రాష్ట్ర నేతలకు దరఖాస్తులను అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కంది శ్రీనివాస్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత శ్రీనివాసరెడ్డికి పదవి దక్కుతుందని అందరూ భావించినప్పటికీ తాజాగా మరో ఇద్దరి పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. ఆయన డీసీసీ పదవిని ఆశిస్తుండగా, పోటీగా కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, తలమడుగు జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి.
తాము పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్నామని, అవకాశం ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షిని కలిసి డీసీసీ కోసం విన్నవించుకున్నారు. ఆమెతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌ను సైతం కలిసి బయోడేటా అందజేశారు. సీఎంకు సన్నిహితుడిగా ఉన్న మరో కీలక నేతతోనూ ఆశావహులు పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురే కాకుండా బీసీ వర్గానికి చెందిన తనకు డీసీసీ పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుడిపెల్లి నగేశ్ సైతం రాష్ట్ర నేతలను కలిసి విన్నవించారు.
తెరపైకి ఖానాపూర్ ఎమ్మెల్యే పేరు
ఆదిలాబాద్ జిల్లాలో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన వెడ్మ బొజ్జు పటేల్ మద్దతు కూడా ఆశావహులు కోరుతున్నారు. ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరిపారు. అయితే, పోటీలో ఉన్నవారిలో ఎంపిక చేయకపోతే.. తానే ఆ పదవిని చేపడతానని పార్టీ అధిష్ఠానాన్ని అడుగుతానని బొజ్జు పటేల్ ఓ సందర్భంగా పార్టీ నేతలతో చెప్పినట్లు సమాచారం.
ఈ పేపథ్యంలోనే డీసీసీ పీఠం ఎవరికి దక్కుతందా అనే చర్చ జోరుగా సాగుతోంది. పదవుల విషయంలో రాష్ట్ర కమిటీలు సర్వే చేసి అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే నియమకాలు జరుగుతాయని నేతలకు అధిష్ఠానం స్పష్టం చేస్తోంది. ఎవరు ఏ పదవి ఆశించినా పీసీసీ నిర్ణయం మేరకే ఎన్నిక ఉంటుందని వెల్లడిస్తోంది.