పెరిగిన ఫేక్ రూ.500 నోట్లు.. ఒరిజినల్ నోటును ఎలా గుర్తించాలంటే..

నకిలీ రూ.500నోట్లకు సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ కీలక ప్రకటన జారీ చేసింది. మార్కెట్లో చలామణీ అవుతున్న నకిలీ రూ.2వేల నోట్ల కంటే రూ.500నోట్లే ఎక్కువని తెలిపింది. గతేడాదితో పోలిస్తే నకిలీ రూ.500నోట్ల సంఖ్య 14.4శాతం పెరిగిందని, ఇప్పటివరకు 91,110నకిలీ నోట్లను గుర్తించినట్టు వెల్లడించింది. మే 30న వార్షిక నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ.. 2022-23 సంవత్సరానికి గానూ వివరాలను ప్రకటించింది. గతేడాది రూ.2వేల నోట్ల నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్య 9,806కు చేరుకుందని తెలిపింది. మునుపటి ఏడాదితో పోలిస్తే రూ.20 (కొత్త డిజైన్) రూ.500 నకిలీ నోట్లలో పెరుగుదల కనిపించిందని, రూ.20 నకిలీ నోట్లు 8.4 శాతం పెరిగాయని పేర్కొంది.

రూ.10, 100 , 2వేల డినామినేషన్లలో గుర్తించిన నకిలీ నోట్లు 11.6 శాతం తగ్గాయని ఆర్‌బీఐ వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో గుర్తించిన మొత్తం నకిలీ భారతీయ కరెన్సీ నోట్లు 2,30,971 కాగా, 2022-23 సంవత్సరంలో 2,25,769 నోట్లకు తగ్గింది. దాంతో పాటు కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చు కూడా తగ్గినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. 2021-22 సంవత్సరంలో కరెన్సీ నోట్లు ముద్రించడానికి రూ.4,984.80 కోట్లు ఖర్చు కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.4,682.80 కోట్లు ఖర్చయిందని తెలిపింది.

మార్కెట్లో రూ.500 నకిలీ నోట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఒరిజినల్ రూ.500 నోట్లను గుర్తించేందుకు ఆర్‌బీఐ కొన్ని గుర్తులను సూచించింది. వాటిలో..

  • కరెన్సీ నోటు ముందు వైపు ఎడమవైపు అడ్డంగా 500 నెంబర్ కనిపిస్తుంది.
  • రెండో గుర్తు పైన దేవనాగరి లిపిలో ₹500 అని కనిపిస్తుంది.
  • కరెన్సీ నోటు మధ్యలో మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది.
  • మహాత్మాగాంధీ చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే హిందీలో భారత్, ఇంగ్లీష్‌లో ఇండియా అనే పదాలు కనిపిస్తాయి.
  • మహాత్మాగాంధీ చిత్రం పక్కన సెక్యూరిటీ త్రెడ్ ఉంటుంది. అందులో భారత్ అని హిందీలో, RBI, 500 అని కనిపిస్తాయి.
  • సెక్యూరిటీ త్రెడ్ పక్కన ఆర్‌బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. సంతకం కింద ఆర్‌బీఐ ఎంబ్లమ్ ఉంటుంది.
  • రూ.500 నోటులో కుడివైపు కింద కరెన్సీ నోట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ సైజు చిన్న నుంచి పెద్దగా ఉంటుంది. ప్రతీ నోటుకు వేర్వేరు నెంబర్లు ఉంటాయి. ఒకే నెంబర్‌తో రెండు నోట్లు ఉండవు.
  • రూ.500 నోటులో కుడివైపు కింద అశోక స్తంభం ఉంటుంది.
  • అంధులు కరెన్సీ నోటును గుర్తించేందుకు నల్లని లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ రెండువైపులా కనిపిస్తాయి.
  •  తెల్లని స్పేస్ కింద స్వచ్ఛ్ భారత్ లోగో, నినాదం ఉంటాయి. లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో తెలుగు సహా 15 భాషల్లో రెండు వేల రూపాయలు అని రాసి ఉంటుంది. మధ్యలో ఎర్రకోట చిత్రం ఉంటుంది. ఎడమవైపు పైన దేవనాగరి లిపిలో ₹500 అని కనిపిస్తుంది.