కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి రైతు సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలను చేపట్టింది. మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేయడంలాంటి పథకాలను పెట్టినప్పటికీ ఇంకా రైతులు సరైన సదుపాయాలను పొందడం లేదు. గత సంవత్సరం ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం దానిని ఇటీవల అమలుచేయడం స్వాగతించదగ్గ అంశం. అదేవిధంగా కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఎం. కోదండ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ను ఏర్పాటు చేసింది.
అదేవిధంగా భూమిలేని రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించడం, ధరణి స్థానంలో భూభారతి పథకాన్ని తేవడం, ఇవన్నీ కూడా రైతుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఒక చిన్న ఆశ రాష్ట్రం లోని రైతాంగంలో కలిగిస్తున్నాయి. అయినప్పటికీ వ్యవసాయ కమిషన్ రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఒక అనుసంధాన కర్తగా పనిచేయాలి. ముఖ్యంగా వ్యవసాయ వృద్ధి, రైతుల ఆదాయం పెంపు దిశగా మౌలిక అంశాలను పరిశీలించి తగిన సిఫారసులను చేయాలి.
కమిషన్ రైతులు తమకేం కావాలో ముందుగానే తెలిపేందుకు వీలుకల్పించాలి. నిపుణులు సైతం తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం కలుగుతుంది. అన్నదాతల ఆదాయాలు పెరగకుండా వ్యవసాయ వృద్ధి చెందదనే నిజాన్ని అందరూ అంగీకరించాలి. గత ప్రభుత్వం రైతుబంధు కిందించిన నిధులు నిజంగా కొంతమంది రైతులకే లబ్ధి చేకూరాయి.
దీనిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. సాగుబడిలో ఉన్న భూములకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ 10 -–20 ఎకరాలలోపు రైతులకు రైతుబంధు పథకం అమలు చేసే విధంగా ప్రభుత్వం మార్పులు తీసుకురావాలి. రాష్ట్రంలో ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఆత్మహత్యలను ఆపేందుకు ఈ కమిషన్ తగిన సూచనలను ప్రభుత్వానికి తెలియ జేయవలసిన అవసరం ఉంది.
- డా.చింత ఎల్లస్వామి-