- యాదాద్రి జిల్లాలో 7 నెలల్లోనే 94 మంది మృతి
- పౌష్టికాహారలోపం, ట్రీట్‌మెంట్ అందకపోవడమే కారణం
యాదాద్రి, వెలుగు : శిశుమరణాలు తగ్గించేందుకు హాస్పిటల్స్‌లో సౌలత్‌లు కల్పించడంతో పాటు, పోషకాహారం పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. గర్భిణులకు పోషకాహారంపై అవగాహన లేకపోవడం, హాస్పిటళ్లలో సరైన ట్రీట్‌మెంట్ అందకపోవడంతో
యాదాద్రి జిల్లాలో శిశువుల మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో సగటున రెండు రోజులకో చిన్నారి చనిపోతోంది. యాదాద్రి జిల్లాలో మొత్తం 22 పీహెచ్‌సీలు, మూడు సీహెచ్‌సీలతో పాటు భువనగిరిలో ఏరియా హాస్పిటల్ ఉంది. ఆయా హాస్పిటల్స్‌లో నార్మల్ డెలివరీ సహా సిజేరియన్లు జరుగుతుంటాయి. ప్రభుత్వ హాస్పిటల్స్‌తో పాటు, ప్రైవేట్ హాస్పిటల్స్ సైతం భారీ సంఖ్యలోనే ఉన్నాయి. అయితే హాస్పిటల్స్‌లో సరైన టైంలో డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడం వల్ల ట్రీట్‌మెంట్ సరిగా అందడం లేదని పలువురు చెబుతున్నారు.
ఏడు నెలల్లో 94 మంది శిశువులు, ఐదుగురు తల్లులు
యాదాద్రి జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం శిశు మరణాల సంఖ్య పెరిగింది. పుట్టిన గంటల వ్యవధిలోనే కొందరు చనిపోతుంటే.. కొద్ది రోజుల తర్వాత మరికొందరు మృత్యువాతపడుతున్నారు. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు 154 మంది శిశువులు చనిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లోనే 94 మంది చనిపోయారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారమే 2018 నుంచి ఇప్పటివరకు 769 మంది చిన్నారులు మరణించారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో మరికొందరు చిన్నారులు చనిపోయినా కొందరు వ్యక్తులు రంగంలోకి దిగి పరిహారం ఇప్పిస్తూ విషయం బయటకు పొక్కకుండా చూస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఐదుగురు తల్లులు చనిపోయారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ లెక్కల ప్రకారం 2020లో మరణాలు 13.28 శాతం ఉండగా, 2021లో 13.42 శాతానికి పెరిగాయి.
సరైన టైంలో అందని ట్రీట్‌మెంట్
శిశువుల మరణానికి పోషకాహార లోపంతో పాటు, సరైన టైంలో ట్రీట్‌మెంట్ అందకపోవడమే కారణమని తెలుస్తోంది. గర్భిణులకు అవగాహన లేకపోవడానికి తోడు పేదరికం కారణంగా పౌష్టికాహారం తీసుకోవడం లేదు. దీంతో చిన్నారులు వివిధ అనారోగ్య సమస్యలతో పుడుతున్నారు. అలాగే యాదాద్రి జిల్లాలోని సర్కార్, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పనిచేసే డాక్టర్లు హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్తుంటారు. దీంతో వీరు పగలంతా ఇక్కడ అందుబాటులో ఉంటున్నా, రాత్రి వేళల్లో మాత్రం ట్రీట్‌మెంట్ అందడం ఇబ్బందిగా మారింది. పైగా కొందరు అర్హత లేని డాక్టర్లు కూడా డెలివరీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కారణాల వల్లే జిల్లాలో శిశు మరణాల సంఖ్య పెరుగుతుందని, వీటిని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని ఆఫీసర్లు చెబుతున్నారు.