హర్షద్ మెహతా వెబ్‌‌ సిరీస్‌‌తో పెరిగిన ఓటీటీ యూజర్లు

స్కామ్​ 1992తో సోనీ లైవ్ హిట్‌‌

హర్షద్ మెహతా స్టోరీ సక్సెస్

సోనీకి పెరుగుతున్న యూజర్లు

యూత్ బాగా చూస్తున్నరు

ఒకే ఒక్క షోతో సోనీ లైవ్‌కి జాక్‌పాట్

బిజినెస్ డెస్క్, వెలుగు: హర్షద్ మెహతా స్కామ్.. ఫైనాన్షియల్ మార్కెట్‌‌పై కాస్తో కూస్తో టచ్ ఉన్న వారందరికీ ఈ స్కామ్ గురించి తెలిసే ఉంటుంది. దీని గురించి ఇప్పుడెందుకు అంటారా..?  ఈ స్కామ్తోనే ‘సోనీ లైవ్ ’ హిట్ కొట్టింది. సోనీ లైవ్  హిట్‌‌కొట్టడమేమిటి..? అదీ హర్షద్ మెహతా స్కామ్తో అంటే.. సోనీ లైవ్  ‘స్కామ్ 1992’ పేరుతో వెబ్‌‌ సిరీస్‌‌ను విడుదల చేసింది. ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్లలోకి అడుగులేస్తోన్న యంగ్ మిలీనియల్స్‌‌కు(యువతకు) ఈ వెబ్‌‌ సిరీస్‌‌పై ఆసక్తి కలిగింది. హర్షద్ మెహతా స్కామ్‌‌పై వెబ్‌‌ సిరీస్‌‌ రిలీజ్ అయ్యాక.. మస్తు మంది సోనీ లైవ్ ‌‌ను సబ్‌‌స్క్రయిబ్ చేసుకుని మరీ దీన్ని వీక్షించారు. ఫైనాన్షియల్ మార్కెట్‌‌లో రిస్క్ తీసుకున్న హర్షద్ మెహతా మాత్రమే కాక.. సోనీ పిక్చర్స్ నెట్‌‌వర్క్స్(ఎస్‌‌పీఎన్‌‌)కు చెందిన ఓటీటీ ప్లాట్‌‌ఫామ్ సోనీ లైవ్  కూడా ఈ సిరీస్‌‌తో పెద్ద రిస్క్‌‌నే తీసుకుందని చెప్పొచ్చు. ఆ రిస్క్‌‌లో హర్షద్ మెహతా ఓడిపోతే.. ఈ రిస్క్‌‌లో సోనీ లైవ్  గెలిచింది. ఈ వెబ్‌‌ సిరీస్‌‌లో ఉన్న ప్రతి ఒక్క డైలాగ్ యువతను బాగా ఆకట్టుకుంది. హర్షద్ శాంతిలాల్ మెహతా పాత్రలో ప్రతీక్ గాంధీ హర్షద్‌‌ను మరిపించారు. సుచేతా దలాల్, దేబాషీష్ బసు రాసిన ‘ది స్కామ్: హు వన్, హు లాస్ట్, హు గాట్ అవే’ బుక్‌‌పై అప్లాజ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఫుల్ రైట్స్ పొందింది. ఆ తర్వాత దీనిపై వెబ్‌‌ సిరీస్‌‌ను ప్లాన్ చేయడం కోసం పలు ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌‌లతో చర్చలు జరిపి, చివరికి సోనీ లైవ్ ‌‌తో డీల్ కుదుర్చుకుంది. అలా సోనీ లైవ్ ‌‌పై ఈ వెబ్‌‌ సిరీస్‌‌ స్క్రీన్‌‌పైకి వచ్చింది.

2013 నుంచి డిజిటల్ మార్కెట్‌‌లో ఇండియాలో ఉంది. ఈ స్పేస్‌‌లో అడ్వాన్‌‌టేజ్ పొందడంలో సోనీ లైవ్  ముందంజలో ఉంది. కానీ ఒరిజినల్ కంటెంట్ విషయంలో ఇన్ని రోజులు కాస్త వెనుకబడిందనే చెప్పొచ్చు. 2019 చివరి నుంచి ఎస్‌‌పీఎన్‌‌ తన డిజిటల్ బిజినెస్‌‌లను మరింత బలంగా మార్చడంపై ఫోకస్ చేసింది. సోనీ లైవ్ ‌‌ బిజినెస్‌‌ హెడ్‌‌గా డానీష్ ఖాన్‌‌ను నియమించింది. ఎస్‌‌పీఎన్ టెలివిజన్ బిజినెస్‌‌లను సక్సెస్‌‌ చేయడంలో ఈయనే ముఖ్యులు. కరోనా లాక్‌‌డౌన్ టైమ్‌‌లో డిజిటల్ కంటెంట్‌‌కు విపరీతంగా డిమాండ్ పెరగడంతో 2020 జూలై నుంచి సోనీ లైవ్  కూడా ఒరిజినల్‌‌ కంటెంట్‌‌ను తన ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌‌పై ఇవ్వడం ప్రారంభించింది. ఆ తర్వాత తన సబ్‌‌స్క్రిప్షన్ ప్లాన్స్‌‌ను రివైజ్ చేసింది. అప్పటి వరకు నెట్‌‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌‌లు శాక్రెడ్ గేమ్స్, ఇన్‌‌సైడ్ ఎడ్జ్ వంటి షోలతో ఒరిజినల్ స్పేస్‌‌ను ఏలేవి. ఇతర ప్లాట్‌‌ఫామ్‌‌లు డిస్నీ ప్లస్ హాట్‌‌ స్టార్, జీ5, వూట్, ఎంఎక్స్ ప్లేయర్ వంటివి తమవైన స్టయిల్‌‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేవి. ఇంత కాంపిటేటివ్ స్పేస్‌‌లో సోనీ లైవ్  ఒకే ఒక్క షోతో.. ఆడియెన్స్‌‌ను తన వైపుకి తిప్పుకుంది. స్కామ్ 1992–హర్షద్ మెహతా స్టోరీతో ఓటీటీ స్పేస్‌‌లో జాక్‌‌పాట్ కొట్టింది.  ‘స్కామ్ 1992’ సోనీ లైవ్  సబ్‌‌స్క్రిప్షన్‌‌ బేస్‌‌ను పెంచింది. సోనీ లైవ్  2020 జూలైలో పెయిడ్ సబ్‌‌స్క్రిప్షన్ ప్యాక్‌‌ తెచ్చినప్పటి నుంచి ఈ  ప్లాట్‌‌ఫామ్‌‌ 6.5 కోట్లకు పైగా(యాప్ ప్లస్ వెబ్) ఇన్‌‌ స్టాల్స్‌‌ను దక్కించుకుంది. సుమారు ఇరవై లక్షల మంది పెయిడ్ సబ్‌‌స్క్రయిబర్లు ఈ ప్లాట్‌‌ఫామ్‌‌పై వచ్చి చేరారు. కేవలం  నాలుగు నెలల్లోనే 20 లక్షల మంది పెయిడ్ సబ్‌‌స్క్రయిబర్లుగా రిజిస్టర్ కావడం ఇతర కాంపిటీటర్లతో పోలిస్తే పెద్ద సక్సెసే. 2016లో నెట్‌‌ఫ్లిక్స్‌‌ లాంచ్ అయిన తన పెయిడ్ సబ్‌‌స్క్రయిబర్లు ఇటీవలే 20 లక్షలను దాటారు.

2012 నుంచే స్క్రీన్‌‌పైకి తెచ్చేందుకు ప్లాన్..

స్కామ్ 1992 వెబ్ సిరీస్ లాంచ్ అయిన తర్వాత.. సోనిలైవ్ డైలీ యావరేజ్ ప్రీమియం సబ్‌‌స్క్రిప్షన్ 143 శాతం పెరిగింది. ఈ నెలలో ఈ షో విడుదలయ్యాక సబ్‌‌స్క్రిప్షన్ సంఖ్య మరింత పెరుగుతోందని డానీష్ ఖాన్ అన్నారు. అయితే ఈ సక్సెస్‌‌ జర్నీ అంతా ఈజీగా సాగలేదని, స్కామ్ 1992ను స్క్రీన్‌‌పైకి తేవడానికి చాలా కాలమే పట్టిందన్నారు. 2012 నుంచే హర్షద్ మెహతా స్కామ్ స్టోరీని స్క్రీన్‌‌పైకి తేవాలని సమీర్ నాయర్ సన్నాహాలు ప్రారంభించారు. సమీర్ నాయర్ టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రముఖులు. సీనియర్ మీడియా ఎగ్జిక్యూటివ్. ప్రస్తుతం సమీర్ నాయర్ అప్లాజ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌కు సీఈవోగా ఉన్నారు. నాయర్ స్టార్ టీవీ నెట్‌‌వర్క్‌‌ లో మార్పులు చేయడంలో కీలక పాత్ర పోషించారు. డైలీ సోప్స్‌‌ను(సీరియల్స్) ప్రవేశపెట్టారు. అమితాబ్ బచ్చన్ కెరీర్‌‌‌‌ను కూడా కౌన్ బనేగా కరోడ్‌పతితో రీలాంచ్ చేశారు. కానీ 2012 టైమ్‌‌లో హర్షద్ మెహతా స్కామ్ను టీవీ సిరీస్‌‌గా లేదా సినిమాగా తీయడం కరెక్ట్ కాదని కూడా నాయర్ భావించారు. 2017లో ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్‌‌ ఇండియాలో ప్రాచుర్యంలోకి వచ్చాక.. హర్షద్ మెహతా స్కామ్ను స్క్రీన్‌‌పైకి తెచ్చేందుకు అవకాశం లభించింది. నాయర్ అప్పటికే అప్లాజ్ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్‌‌ హెడ్‌‌గా తన జర్నీ ప్రారంభించారు.  వెంటనే సుచేతా దలాల్ ను ఆశ్రయించి, ఆమె రాసిన బుక్ రైట్స్‌‌ను పొంది, పలు ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్‌‌తో చర్చలు జరిపారు. ఇలా సోనిలైవ్‌‌కు హర్షద్ మెహతా స్టోరీని స్క్రీన్‌‌పైకి తెచ్చే అవకాశం దక్కింది. 550 పేజీల స్క్రిప్ట్‌‌ను ఓటీటీ సిరీస్‌‌గా తీసుకురావడంలో  సమీర్ నాయర్, డైరెక్టర్ హన్సల్ మెహతా, ఆయన టీమ్ సక్సెస్ సాధించారనే చెప్పొచ్చు.

For More News..

సొంత రాష్ట్రంలో నష్టపోతున్నది ఉద్యోగులే